Pages

వాసంత సమీరంలా నులివెచ్చని గ్రీష్మం లా సారంగ సరాగం లా అరవిచ్చిన లాస్యం లా.......ఒక శ్రావణ మేఘం లా.......ఒక శ్రావణ మేఘం లా ...శరత్చంద్రికల కలలా.....హేమంత తుషారం లా నవ శిశిర తరంగం లా..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ....సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

Saturday, December 10, 2011

నమ్మదగిన బంటు




మా ఇంటికి కొత్త కారు వచ్చింది ...నాన్న కి తప్ప ఎవరికి "driving రాదు ,ప్రతి సారి ఆయనని కాక పట్టటం మా వల్ల కావటం లేదు ,పోని నేర్చుకుందామంటే "long "time ప్రోసెస్ ఇంక ఒకటే దారి డ్రయివర్ గారిని పెట్టుకోవటం ..దానికి కూడా కావ్ కావ్ అని అందరం అరిస్తే నాన్న ఒప్పుకుని వెతికి వెతికి ఒక వజ్రాన్ని తెచ్చారు .వాడికి నాకన్న 2 రెట్లు ఎక్కువ బద్దకం .కారు తీయరా అంటే అయ్యగోరు వద్దన్నారండి ఆయ్ అనో ,ఆయ్ ఇక్కడే కదాండి రిక్షాలో వెళ్ళిరండి అనో తప్పించుకోవాలని చూసేవాడు .మా అందరికి వాడిని చూస్తే అరికాలి మంట నెత్తి కెక్కేది .. తీసేద్దామంటే పవర్ ఆఫ్ అటార్నీ మాది కాదు ,మళ్ళీ ఇంకోడు రాడు (అంటే ఇంక రానివ్వరు )..టంచను గా భోజనం "time కి వచ్చి , తిని ఒక కునుకేసి ,సాయంత్రం టీ తాగి ఇంటికి వెళ్ళిపోయేవాడు ....ఎలాగో వాడితో అగచాట్లు పడేవాళ్ళం .. ఒకసారి పుష్కారాలకి మా బాబాయ్ లు ..మావయ్యలు అందరు కలిసి ..గోదావరి స్నానానికి సదరు డ్రయివరు గారి సహాయంతో కారులో వెళ్ళారు .. 2 గం || గడచిన తర్వాత మా వాళ్ళందరు కాలి నడకన వచ్చారు .విషయం ఏంటంటే కారు ఎక్కడొ పార్కు చేసి సారు గారు కారులోనిద్రపోయాడట.. వెతికి వేరే దారి లేక బుస్సెక్కి వచ్చారు ..నెమ్మదిగా వాడు కూడా ఒక గంటకి వచ్చాడు ..వీధిలోతిట్లన్నీతిని , అన్నం తినడానికి పెరటి వైపు కి వచ్చాడు . ఎందుకురా మారు మాట్లాడలేదు అని మా అత్త అడిగితే మరి తప్పే కదాండి , అని ఒక వెకిలి నవ్వు నవ్వాడు .అయినా మా నాన్నకి ఎందుకు వాడంటే నమ్మకమో అర్ధం కాలేదు .తర్వాత వాడి పని దుర్భరం చేసాడు మా బాబాయ్ ,కారు తీయని రోజు వాడి చేత మిగిలిన పనులు చేయించే వాడు . విసుక్కుంటు్ చేసేవాడు .ఇంత జరుగుతున్నా మా నాన్నకి మాత్రం చెప్పేవాడు కాదు ..


ఒకసారి మేమందరం కలిసి పెళ్ళి కెళ్తున్నాం . మా నాన్న వాళ్ళు వేరే కారు లో వస్తున్నారు ,ఆడవాళ్ళందరం మా కారులో ఉన్నాం ,కొంత దూరం తర్వాత నేను డ్రైవ్ చేస్తా అన్నాను. మళ్ళి సేమ్‌ dailogue నాన్న గారు ఇవ్వొద్దన్నారండి అని ,పర్లేదు అన్నాను ,అయినా మాటొత్తాదండి అన్నాడు . మా పిన్ని రెండు తిట్లు తిట్టి నేను చెప్తాలే అయ్యగారికి ఇవ్వు అంది , గొప్పగా తీసుకుని డ్రైవ్ చేయడం మొదలు పెట్టాను . కొంత దూరం వెళ్ళిన తర్వాత direct గా ఆగిఉన్న hero honda ని చక్కగా తగిలించాను .బండి వాడు వచ్చి చూసేసరికి driving సీట్ లో మా వాడు ఉన్నాడు , పాపం నోటికొచ్చిన తిట్ట్లన్ని తిట్టాడు వాడిని .ఈ విషయం కూడా మా నాన్నకి చెప్పలేదు , ఇంకేముంది ఇంట్లో ఆడవాళ్లందరికి వీడు నమ్మిన బంటు అయిపోయాడు , అయినా మా బాబాయ్ మాత్రం వదిలేవాడు కాదు. ఎక్కడికి వెళ్ళినా ప్రసాదు ..కారు అలవాటయిపోయింది అందరికి .ఎప్పుడైనా బయటకి వెళ్తే ముందు మమ్మల్ని మంచి హోటల్ కి తీసుకువెళ్ళీ ఫుల్లు గా తినిపించి అప్పుడు ఊళ్ళన్నీ తిప్పేవాడు .ఏ ఊరు వెళ్ళినా ఇక్కడ పూరీలు బాగుంటాయనో ...పెసరట్లు బాగుంటాయనో ..చెప్పి "marketing స్కిల్సు చూపించేవాడు . మా పెద్ద బాబాయ్ కొత్త కారు hyd లో కొన్నాడు .అది అక్కడి నుంచి వాళ్ళూరు వరకు తేవడానికి ప్రసాదుని తీసుకు వెళ్ళాడు . వచ్చేటప్పుడు కారు కి పెద్ద "accident అయింది .ఎవరికి ఏమి కాలేదు దేవుడి దయవల్ల .మా నాన్న వాడిని పిచ్చి తిట్లు తిట్టారు ,వాడు కిమ్మనలేదు . తర్వాత నెమ్మదిగా మా బాబాయ్ చెప్పాడు ,వద్దన్న వినకుండా తనే drive చేసానని .వాడు మా ఇంట్లో మనిషయిపోయాడు . నా పెళ్ళికి వాడు చేసిన పని ,హడావుడి అంతా ఇంతా కాదు .ఇప్పటికి మా నాన్న వాళ్ళు ఇక్కడికోస్తే తెగ ఫోనులు చేస్తూ ఉంటాడు ,ఎప్పుడొస్తారు అంటూ . మేము వస్తున్నామంటే తుఫానొచ్చినా, అర్ధరాత్రయినా మాకోసం రైల్వే స్టేషను కి వచ్చేస్తాడు. పండగ అంతా వాడిదే,మావారికి ఊరంతా చూపిస్తూ ,పిల్లలతో పాటు అష్టాచెమ్మాలు ఆడుతూ ,మళ్ళీ మా తమ్ముడితో "circket ఆడుతు మధ్యలో వంట అయిందా అని అడుగుతూ తెగ హడావుడి చేసేస్తాడు.వాడి ఇంటి నుంచి ఫోను వస్తే నేను రానని చెప్పండి అని చెప్పించేవాడు మా అమ్మ ఆవకాయ్ పెడుతోందంటే చాలు పెరట్లోనే తిరిగుతూ ఉంటాడు,ఎప్పుడెప్పుడు లాగిద్దామా అని ఆవకాయ్ పిచ్చోడు వాడు .మీ ఆవిడ తిడుతుంది ఇంటి కెళ్ళరా అంటే కదిలే వాడు కాదు. నీ చేత మేము ఇంత పని చేయించుకున్నాం కదా కోపం రాలేదా అంటే.వెంటనే మా బాబాయ్ దగ్గరికి వెళ్ళి ఈ రాయిని చెక్కి శిల్పం చేసారు ఈయన అని అంటాడు .ఇలాంటి మంచి వాడు ఎవరికైనా దొరుకుతారా.... :)

2 comments: