Pages

వాసంత సమీరంలా నులివెచ్చని గ్రీష్మం లా సారంగ సరాగం లా అరవిచ్చిన లాస్యం లా.......ఒక శ్రావణ మేఘం లా.......ఒక శ్రావణ మేఘం లా ...శరత్చంద్రికల కలలా.....హేమంత తుషారం లా నవ శిశిర తరంగం లా..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ....సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

Thursday, February 2, 2012

ఇది అల్లరా ...కాదు కాదు కానే కాదు

నేను ఇప్పుడు ఒక మగానుభావును గురించి రాయబోతున్నాను .....వారు ఎవరంటే .....

మా......మా.........నేను స్కూల్ కి వెళ్ళను ,

 ఏం ఎందుకు వెళ్ళవు ? అడిగింది సదరు "మా" అనబడే వాళ్ళ అమ్మ .
ఆ టీచర్ కి ఇంగ్లిష్ రాదు మరి ఇంక నేను ఆమె దగ్గర ఏం నేర్చుకుంటాను చెప్పు ?
నీకు ఎలా తెలుసు ఆవిడకి రాదని ..
నన్ను ఒక్క కొచ్చెనేసింది దాంతో నాకు తెల్సిపోయింది ..ఏమిటా కొచ్చెను నాకు చెప్పు ...
"what is your fathers name? అని అడిగింది నాకెంత మంది ఫాదర్స్ ఉంటారని ఆవిడ ఉద్దేశ్యం? అలా అడిగింది అందుకే నేను స్కూల్ కి వెళ్ళను ..ఒరేయ్ అది fathers కాదురా "father's రా అంటే మీ నాన్న యొక్క పేరు ఏమిటి అని అర్ధం .వీడి తెలివి తేటలకి నా జోహార్లు ...అంతేకాదు కొత్త కొత్త పదాలు నేర్చుకోవడం ..అలాంటి మాటలు అనకూడదు అని వాళ్ళమ్మ కొడితే ..ఏడుస్తూ కూడా మళ్ళీ అవే మాటలు మాట్లాడుతూ ఏడవటం , దెబ్బలైనా తింటాను కానీ అల్లరి మానను అనుకునే రకం . ఒక సారి బాత్రూం లోకి వెళ్ళి తలుపు గడియపెట్టేసుకున్నాడు . బయట నుంచి వాళ్ళమ్మ స్టూలు వేసుకుని లోపలికి వంగి తీసింది లేకపోతే వాడు కాసేపట్లో ఆరునొక్క రాగం అందుకునేవాడే .ఒకరోజు ఏమైందో మరి నా మీద ప్రేమెక్కువై నా కుడిచేతి బొటనవేలు లటుక్కున కొరికేసాడు , ఏం చేస్తాం వాడి అల్లరి కి నేను కూడా ... :'( మా బాబాయ్ పెళ్ళి అయింది ఎవరైనా పిల్లలు ఆటలు ఆడుతూనో ఎవరితోనో దెబ్బలాడుతూనో ఉంటారు , వీడు మాత్రం పెళ్ళి బాజాల దగ్గర కూర్చుని ఎలా వాయిస్తున్నారో చూసేవాడు , అంతే కాక చెట్టు బెరడు ని మెడలో వేసుకుని ,రెండు పుల్లలు చేతి తో పట్టుకుని నోటితో సౌండ్ చేస్తూ వాయించేవాడు .

 వాడికి స్నానం చేయిద్దామనే నీళ్ళు తోడుతూ నేను నూతిలో పడ్డాను , నేనే వచ్చి నిన్ను కాపాడేవాణ్ణి కానీ  నేను స్నానం చేయటానికి రెడీ గా ఉన్నాను కదా ఓన్లీ నా ఒంటిమీద అండర్ వేర్  మాత్రమే ఉంది అందుకే రాలేదు అందరూ షేమ్ షేమ్‌ అంటారు అని అన్నాడు , అప్పటికి వాడి వయసు బహుసా ఆరేడేళ్ళు .

తర్వాత వాడితో పాటుగా అల్లరి పెరుగుతూ అది ఆగడాల లిస్ట్ లోకి చేరిందిట , ఎందుకంటే ఆ టైం లో నేను వాడితో పాటు లేను .

తర్వాట వాడు చాలా పెద్దవాడయ్యాడు ఎంత అంటే  పీజీ చేసేంత ..అంతేకాదు పీజీ అంటే మా బాబాయ్ పరిభాషలో "పందిరి గుంజ" అని కూడా అర్ధం (పందిరి కి వేసే వెదురు గడంత ) నిజంగానే వాడు అంత పొడుగు కూడా ఉంటాడు .వాడి తో పాటు బద్దకం కూడా బాగా పెరిగింది . కానీ వాళ్ళమ్మకి సాయం చేయడం లో మాత్రం ఉండేది కాదు . అదొక్కటే వీడి లో నాకు కనబడే మంచి .

కొన్ని రోజులు పాటు వాళ్ళింట్లో ఉండటానికి వెళ్ళాను ,నా ప్రోజెక్ట్ అక్కడే పూర్తి చేద్దామని , కానీ వాడు నాకూ , వాళ్ళ చెల్లికి కాళరాత్రులు చూపించాడు . పగలంతా  మొద్దు లా నిద్రపోయి ..మధ్యాహ్నం 1 కి లేచి అప్పుడు అన్నతిని , మళ్ళీ పడుకుని రాత్రుళ్ళు లేచి కూర్చునే వాడు అంతే వాడు అప్పుడు వాడి గోల మొదలుపెట్టేవాడు కాసేపు కంప్యూటర్ లో పాటలు ...మాకు పాట్లు ఆపరా అంటే ఇంకా సౌండు పెంచేవాడు , తిడితే వాడి దగ్గర  ఉన్న             మౌత్ ఆర్గాన్‌ తీసుకొచ్చి వాయించేవాడు అదేదో మమ్మల్ని ఆనందింప చేయడానికి అనుకుంటున్నారేమో మహ గొప్పగా వాయిస్తాడు అనుకుంటే పొరపాటు ...బాబోయ్ వాడి సంగీతం వినేకంటే డిడి8 సప్తగిరి లో వచ్చేవ్యవసాయ దారుల కార్యక్రమం పప్పు రొయ్యల పెంపకం , వరి నాట్లు వేయటం ప్రసారాలు చూస్తూ హాయిగా బాధ తెలియకుండా సునాయాసంగా ప్రాణాలు వదిలేయచ్చు . ఎలాగోలా వాడిని బ్రతిమాలి పానీపూరీ లు తినిపిస్తామని మాట ఇచ్చి వదిలించుకునేవాళ్ళం .మేము ఎంత తెలివి తక్కువ వాళ్ళ మంటే  వాడి వెపన్శ్ దాచేయాలి అని కూడా మాకు తట్టేది కాదు అంతలా వాడి వాయిద్యాలతో మా బుర్రలు మట్టి కొట్టుకు పోయేలా, తుప్పు పట్టి పోయే్లా  చేసేవాడు . ఒకరోజు మా ఖర్మ కాలి వాడి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు  , మా వీధి లో ఏక్ తార లు అమ్మేవాడు వచ్చాడు , అంతే ఇంక చూసుకోండి మా సామి రంగా అంటూ వాడి దగ్గర్ కొనేసేసి ... రాత్రుళ్ళు ఈ కొత్త వాయిద్యం తో వాయిస్తూ మా చెవులు చిల్లులు పడేలా ..సాక్షాతూ పిశాచాలే వచ్చి తమ స్వహస్తాలతో వాయిస్తున్నారా!! అన్నంత మధురంగా వాయించేవాడు .ఒకసారి కోపం వచ్చి విరగొట్టేసాము , మా గ్రహచారం గడ్డితిని మళ్ళీ ఆ ఏక్ తారా లు అమ్మేవాడు దాపురించాడు , ఈ సారి ఒకటికి రెండు కొన్నాడు , ఏదో సినిమాలో తనికెళ్ళ భరణి "పాత సామానులు కొంటాం "  అని ఎంట్రీ ఇచ్చినట్లు కొత్త ఏక్ తారా కొనాలని అనుకున్నప్పుడల్లా వచ్చేవాడు , వాడికి మా వాడు డైలీ కస్టమర్ అయ్యాడు .చిన్నప్పుడు మా బాబాయ్ పెళ్ళి లో నేర్చుకున్న సంగీతం ఇప్పుడు ఉపయోగ పడిందన్న మాట వాడికి .

ఒకసారి వాళ్ళ నాన్నమ్మ కొన్ని రోజులు ఇక్కడ గడిపి వెళ్ళింది , ఆవిడ అటు వెళ్ళిందో లేదో వాళ్ళమ్మని ఇంక      మీ అత్తగారు జంప్ కదా షురూ చేయ్ తీన్‌ మార్ అని , అసలు వీడి బుర్రలో ఏం తిరుగుతూ ఉంటుందో అర్ధమయ్యేది  కాదు .

టివీ ఆన్‌ చేసి కూర్చునేవాడు చదువులు చెడతాయని వాళ్ళ నాన్న కేబుల్ పెట్టించలేదు ఈ ఉద్ధండుడు మేడెక్కి ఏదో మతలబు చేసి కేబుల్ టివి ప్రసారాలు మచ్చలు కానీ చుక్కలు కానీ లేకుండా వచ్చేటట్లు చేసాడు , అంతే కాదు ఎపుడైనా సిగ్నల్ పోయి రాకపోతే ఆ దుర్మార్గుడు నన్ను మేడపైకి పంపి సరిచేయమనే వాడు ఎక్కడం దిగడం ..సరిగా వచ్చేంతవరకు ఇదే పని :'(.ఈ హడావుడి లో వాళ్ళ నాన్నకూడా అసలు విషయం మర్చిపోయి తనుకూడా కొడుకుతో పాటు టివి చూడటం మొదలు పెట్టాడు .

ఒకసారి మేమందరం కూర్చుని అత్త కోడళ్ళ డైలీ సీరియల్ చెత్తగా ఉన్నా మా కళ్ళన్నీ టివీ కి అప్పచెప్పి చూస్తున్నాం . సడన్‌ గా మాకు ఎలుక చచ్చిన కంపు కొటటం మొదలయింది , దెబ్బకి మేము ఆ సీరియల్ నుంచి బయటకి వచ్చి ఎక్కడబ్బా ఆ వాసన  అని తెగ వెతకడం మొదలు పెట్టాము , వెతకగా వెతకగా అది చెప్పుల స్టాండు నుంచి వస్తోందని తేలింది , బాగా పరిశీలిస్తే తెలిసింది మా బంగారయ్య వేసుకున్న సాక్స్ ల నుంచి అని ఫైనల్ నిర్ణయానికి వచ్చాము , గత నెల రోజులుగా మార్చకుండా వాడుతున్నాడట , పైగా కొత్తవే మొన్ననే నెల క్రితమే మార్చాను అన్నాడు . వాడి సాక్సులు ఉతికితే వాషింగ్ మెషీన్ ఎక్కడ పాడవుతుందో అని భయంతో వాళ్ళమ్మ అందులో కూడా వేయనివ్వకుండా విడిగా ఉతకమనేది , అవి నాన బెట్టిన బకెట్ కి పట్టిన వాసన వేడి నీళ్ళు వేసి  కడిగితే కానీ పోదేమో అని అనుమానం కూడా ఉంది . కానీ వాడు అసలు ఉతుకుంటే గా(ఎందుకంటే వాడి సాక్సులు ముట్టుకునే ధైర్యం మా ఇంటి పనమ్మాయికి కూడా లేదు ).మరి . ;-).

ఒకరోజు మేమందరం చదువుకుంటూ పడుకునే రూమ్ సర్దుదామని అనుకున్నాను , వాళ్ళమ్మ చెపుతూనే ఉంది ఎందుకొచ్చిన గొడవ వాడితో సర్దకు అని , అయినా నేను వినలేదు , నేను సర్దటం మొదలు పెట్టాను , పురావస్తు శాఖ తవ్వకాలు మొదలు పెట్టినట్లు అయింది నా పని ఏవేవో పాత వైన వస్తువులు కనిపించకుండా పోయాయి, లేదా పోయాయి అనుకున్నవి దొరికాయి , ఎలాగైతేనేం మధ్యాహ్నానికి వాడి బుక్స్ రేక్ సర్దాను , సాయంత్రానికి బలాదూర్ తిరిగి వచ్చి గది లోకి వెళ్ళి దేని కోసమో కలగాపులగంగా వెతకటం మొదలు పెట్టాడు , ఏమిట్రా అని అడిగితే  పుస్తకం ఒకటి కనిపించటం లేదు అన్నాడు తీసి ఇచ్చాను , నేనే సర్దాను గందరగోళంగా ఉందని అన్నాను పేద్ద గొప్పగా అంతే కయ్ మని అరిచి నోటికొచ్చిన అరుపులన్నీ అరిచాడు , వాడికి అలాగుంటేనే ఇష్టమట అన్నీ చక్కగా కనిపిస్తూ ఉంటాయట . ఇలాంటి వాడిని ఏం చేయాలి , ఆ గదిలో ఆంజనేయ స్వామి పోస్టరు పెద్దది ఉండేది దానిని చూసినప్పుడల్లా నాకు అది ఖాళీ గా ఉన్నట్లు అనిపించేది కళ్ళు నులుముకుని చూస్తె  నార్మల్బ గా ఉండేది బహుసా వీడి గందరగోళాన్ని చూసి ఆ దేవుడే మాయమైపోయాడేమో అని నా డౌట్ ,  అప్పటినుంచి వాడి పుస్తకాల జోలికి నేను వెళ్ళలేదు , తర్వాత ఇంకో విషయం ఏంటంటే పాత న్యూస్ పేపర్లు కూడా అమ్మనివ్వ కుండా దాచి ఉంచాడు అవి మూటలు మూటలై పేద్ద గడ్డి మేటులయ్యాయి .

నాకేదైనా హెల్ప్ చేయరం అంటే చచ్చినా చేయను అనేవాడు , నేను నా నోటికొచ్చిన తిట్లన్ని తిట్టిన తర్వాత చేసేవాడు , ముందే చేసిఉంటే ఈ గొడవ ఉండేది కాదు కదా ? ఏమొ మరి ?

ఇల్లు మారారని తెలిసి రెండు నెల్లయింది,అలాగే లేటవుతోంది ఈ సారైనా చూద్దామని వెళ్ళాను , ఇల్లంతా బాగుంది వీళ్ళ బెడ్రూం లోకి వెళ్ళి చూసాను అన్ని నీట్ గా సర్ది ఉన్నాయ్ కానీ ....చంద్రుడి లో మచ్చలా , తులసి వనం లో గంజాయి మొక్కలా ,బాపూ గారి సినిమా చూస్తుంటే మధ్యలో వచ్చే మాల్టోవా ఏడ్ లాగా  రెండు పెద్ద సైజ్  మూటలు కనిపించాయ్ ఏమిటవి అని అడిగితే మీరెవ్వరూ ముట్టుకోవటానికి వీల్లేదు అని ఏవో అమూల్యమైన వస్తువులన్ని ఉన్నట్లు బోడి గొప్పలు వీడూను అవే పాత పేపర్లు ,పుస్తకాలు , మా వారు అడగనే అడిగారు ఏమిటా మూటలు అని ఏమని చెప్తాం మరి ముసి ముసి నవ్వులు నవ్వుకుని వచ్చేసాము , అక్కడ ఓ మూలగా గిటారుని గిరాటు వేసినట్లు ఉంది అని చూసాను , ఏంటని అడిగితే ఈ సారి వాడు హింసించే పనిముట్టు ఇదే తెలిసింది  ఏక్ తారా లు అవి వాయించడం ఎప్పుడో మానేసాను అన్నాడు అంటే దాని అర్ధం ఇదా , మొత్తానికి మానలేదు , మారలేదు ..హమ్మయ్య అదృష్టం కొద్దీ నాకు పెళ్ళైపోయింది లేదంటే మా ఊరు వచ్చి కూడా వాడి టాలెంట్ చూపించేవాడు .

 ఇప్పటికి నేనంటే అభిమానమే వెర్రి నాగన్న కి ఎప్పుడూ ఫోను చేసి కాసేపు మంచీ చెడూ మాట్లాడుతూ ఉంటాడు .

 వీడికి బలవ్వడానికి త్వరలో ఇంకో జీవి రాబోతోంది పాపం ఆ అమ్మాయిని ఆ దేవుడే కాపాడాలి , ఆ అమ్మాయి కి వీడిని మార్చుకునే ఓపిక ఉండాలి  ,లేకపోతే వీడి ని ఓర్చుకునే ధైర్యం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా వినాయకుడిని కోరుకుంటున్నాను .

ఇంతకీ వాడెవరో చెప్పనే లేదు కదూ ...వాడు మా చిన్నమేనమామ కొడుకు , మా అమ్మకి ముద్దుల మేనల్లుడు అయిన మగానుభావుడు . వాడిపేరు అనంత్ శరత్ చంద్ర ...పేరుకి తగ్గట్లు వీడు రాత్రులే వెలుగుతూ (మోగుతూ )ఉంటాడు . మొన్న మా అల్లరి గురించి రాసినప్పుడు ..వాడి గురించి అసలు ఏమీ రాయలేదని ఫీల్ అయ్యాడు నీ యెంకమ్మ ఎందుకే అంత తక్కువ రాసావ్ అని అడిగాడు అందుకే మళ్ళీ ప్రత్యేకించి ఇలా రాస్తున్నా ....ఎంత రాసినా ఇంతకన్నా దారుణంగా నేను రాయలేను , కోరి కోరి నీకున్న ఇమేజ్ స్పాయిల్ చేసుకున్నావ్ రా శరత్ ...సారీ రా ఏం చేయను చెప్పు రాయడం మొదలు పెడితే నిజాలే బయటికి వస్తున్నాయి రా దున్నపోతా.అందుకే ఇంతటితో ఆపేస్తున్నా ....ఇంకోసారి సారీ :




2 comments: