Pages

వాసంత సమీరంలా నులివెచ్చని గ్రీష్మం లా సారంగ సరాగం లా అరవిచ్చిన లాస్యం లా.......ఒక శ్రావణ మేఘం లా.......ఒక శ్రావణ మేఘం లా ...శరత్చంద్రికల కలలా.....హేమంత తుషారం లా నవ శిశిర తరంగం లా..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ....సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

Showing posts with label నవ్వు నవ్వించు. Show all posts
Showing posts with label నవ్వు నవ్వించు. Show all posts

Wednesday, August 14, 2013

చెప్పేదేదో సరిగా అఘోరించు

ఎవరైనా మరాఠీలో మాట్లాడటం స్టార్ట్ చేస్తే చాలు ,..
వాళ్ళ చేతులవంక , నోటి వంక మార్చిమార్చి చూస్తూ ఓ పక్క మూగగా రోదిస్తూ
నేనో బదిరురాలిననే బాధ వచ్చేస్తుంది ..
మా వాడిని తీసుకొస్తుంటే ఇప్పుడే ఒకావిడ
దారికడ్డంగా ఆపేసి ... (తెలిసున్నావిడే, ఎదురు అపార్ట్ మెంట్ )
తెగ చేతులు , తిప్పేస్తూ లొడ లొడా , బడ బడా , ఒక్క సెకన్ గేప్ ఇవ్వకుండా ..
మీకొచ్చిన డౌట్ అర్థమైంది ..ఏం చేయను ఆ పరిస్థితిలో నేను గేప్ ఇవ్వాల్సి వచ్చింది ;-)
మాఝా మోఠా ముల్గా అన్నది తప్ప ఇంక వేరేది ఒక్క ముక్క అర్థం కాలేదు
హి హి హి అని వెర్రి నవ్వు నవ్వాను ..
ఆ దొంగమొహానికి తెలుసు నాకు మరాఠీ రాదు , చెప్పిందంతా గాల్లో కే వెళ్తుంది అని ..
అయినా దొరికింది లెమ్మని తెగ ఆడేసుకుంటోంది ,
నీ భాషని బాతులెత్తుకుపోనూ ..
భాషరాని వాళ్ళని ఏడిపిస్తే నరకాలు పట్టి పోతావే .
నిన్ను కుంభీపాకం లో వేస్తారే 
నీ అఘోరామొహం తగలెయ్య 

చెప్పేదేదో సరిగా చెప్పి చావు అని తిడదామనుకుని , మరాఠీలో ఏమంటారో తెలీక
విపరీతమైన అవకాశం ఇచ్చేసాను దానికి ...
అయినా ఆపదే ఒక 5 నిమిషాలు నా ఫీలింగ్స్ తో సంబంధం లేకుండా వాగి
అప్పుడు అది గేప్ ఇచ్చింది , ఊపిరి పీల్చుకుంది ..

మళ్ళీ ఆప్ చలో బారిష్ ఆనేవాలా హై అంది ..
అదేదో ముందే చెప్పి ఏడవచ్చు కదా..
ఇంత చిన్న పదానికి అంత మరాఠీనా

తెలుగుకన్నా ఎక్కువ అక్షరాలున్నట్టున్నాయ్ అనుకుని ..

Vroom Vroom Vroom స్టార్ట్ చేసేలోగా ,

ఆ ముల్గా గాడిని తీసుకొచ్చి నా వెనుక కూర్చోబెట్టింది

వార్నీ ఇదా సంగతి ,
ఆ మేడం బండి తేలేదు , అందుకని కొడుకుకి లిఫ్ట్ ఇచ్చి ఇంటిదగ్గర దింపాలి
ఈ మాత్రానికి 5 ని || పచ్చి పచ్చిగా అచ్చ మరాఠీలో వాగడం ఎందుకు
థమ్సప్ చూపించి , లిఫ్ట్ అని అడగొచ్చుగా ...ఎంకమ్మటెంకి ..నా టైం అంతా వేస్ట్ చేసింది

లాస్ట్ లో మా వాడికో పెద్ద డౌట్ వచ్చింది , అమ్మా నీకు మరాఠీ వచ్చని చెప్పలేదే ??? నువ్వు సూపర్ అమ్మా




వాళ్ళమ్మ  "సూపర్ఉమన్ " అనే ఫీలింగ్ వచ్చేసింది మా వాడికి ....
అబ్బే దాందేముందిరా తెలుగెంతో , హిందీ అంతే ..
హింది ఎంతో , మరాఠీ అంతే ...చాలా వీజీ
డోంట్ వర్రీ నే నేర్పుతాగా ..
( దీనెంకమ్మా నన్ను ఇరికించింది ,రేపే రెపిడెక్స్ కొనాలి ,దీని బండిని పక్కింటోడు ఎత్తుకుపోనూ ..)


Monday, December 19, 2011

కొంచం కోపం ....కొంచం జాలి

 పొద్దుటే మా వారి సుప్రభాతం వినిపించి, మెలకువ వచ్చింది అంటే ఏంటో అనుకునేరు ..
తనకింద పని చేసే కంట్రాక్టర్లను తిడుతూ ఉంటారువాళ్ళు పొద్దునే 6 గం " కి ఫోను చేసి ముందు రోజు జరగని పని గురించి చెపుతారు ..ఇంకా మావారు తన కొచ్చిన జంధ్యాల తిట్లన్నీ ఉపయోగిస్తూ ఉంటారు ...పోనీ వాళ్ళని మానిపించి కొత్తవాళ్ళని పెట్టుకోమే పెట్టుకోరు , వాళ్ళు కూడా పని మానేసి వెళ్ళరు ....ఒక సారి మా వారు లేని టైం లో ఫోను వస్తే అడిగాను ఎందుకయ్యా సార్ తో తిట్లు తింటారు ..వేరే పని చూసుకోవచ్చుగా అని దానికి అతని సమాధానం ...ఏందో మేడం సార్ తిడితేనే మాకు జోష్ వస్తది ..లేదంటే ఆ రోజంతా  "dull గా ఉంటుంది,హమ్మో వీళ్ళ అనుబంధం బంగారం కాను అనుకున్నాను .

ఎలాగోలా వీలు చూసుకుని ఇవాళ  నేను చెప్పిన పని చేయించు , దగ్గరలో ఎవరైనా మంచి పనివాడు ఉన్నాడేమో అడుగు అని చెప్పి ఆఫీసుకి వెళ్ళిపోయారు మా వారు .
హమ్మ ఇప్పటికిప్పుడు ఎలా ? ఆలోచిస్తుండగా వచ్చింది పనమ్మాయ్ రమ.

మంచి "carpenter ఎవరైనా ఉన్నారా ఇక్కడ "main దర్వాజాకి లాక్ , ఇంకా door stoppers  పెట్టించాలి .
మా ఆయనున్నాడు  , ఆ పనే  చేస్తాడు చెప్పేదా ? ...
హమ్మయ్య బ్రతికించావ్ తల్లి త్వరగా రమ్మని చెప్పు ..
ఒక అరగంటకి పేద్ద బేగు వేసుకుని వచ్చాడు , ఏం చేయాలి  ...అడిగాడు ..చెప్పాను ఏమి చేయాలో
ఏమి లేవు ఇం చిన్న పనికి నన్ను పిలిచారు  ....అని కాస్త విసుగుతో మొహం పెట్టి ..సర్లే కాని పాపం మళ్ళీ మీరు ఎవరినని వెతుకుతారు అని జాలి ,దయ తలిచి నాలుగు తలుపులకి పెట్టటానికి ఒక రెండు గంటలు కుస్త్తీ పట్టి ఎలాగో బిగించాడు ...main door కి magic eye కూడా పెట్టమని అడిగాను ..
మళ్ళిదేంటి  అని అడిగాడు . వాడికి వివరించి చెప్పాను ..దా...భూతాల్లా కనిపిస్తారు మనుషులు , భూతద్దం అని చెప్పాలి దాన్ని ...ఏందమ్మా అది కూడా తెల్వదా నీకు .
సరెలే...... నాకు తెలీదు కాని.... తెచ్చి బిగించు ...అన్నాను ..ఏం జేస్తాం తప్పుద్దా
"lunch జేసి వచ్చి పెడ్తా అని వెళ్ళి ఒక  రెండు గంటలు గడచిన తర్వాత  తీసుకు వచ్చి నానా తిప్పలు పడి రకరకాల యోగాసనాలు వేసి బిగించాడు , అయింది చూస్కో అన్నాడు .
వెళ్ళి చూస్తే వాడి తెలివి తేటలకి నాకు ఒకరకమైన వింత నవ్వు వచ్చింది . వాడు అటుది ఇటు తిప్పి పెట్టాడు ..
ఇదేంటయ్యా ఇలా పెట్టావ్ , ఇటు ఉండాలి కానీ .....అమ్మా నువ్వు చెప్పింది నిజమే గానీ ...కొంచం వెరైటీగా ఉంటుంది అని ఇలా చేసా ..మంచిగుంది కదా  ఉండనీ అన్నాడు .
ఇంకా నయం సాయంత్రం సారొస్తడు ఆయనకి చూపించు నీ మేధావి తనం నాకు కాదు ,ముందు మంచిగా చేస్తేనే నీకు పైసలిస్తా లేదా...మీ ఆవిడని కూడా పని మానిపించేస్తా జాగ్రత్త బెదిరించాను .. ఆపమ్మా నీల్లి  చేస్తా కాని ...గట్టిగా అరవకు ..అని గొణుక్కుంటూ మార్చి చేసాడు ...
వాడికి డబ్బులు ఇచ్చేటప్పుడు పాపం ఇంతసేపు కష్టపడి చేసాడు కదా అని కొంత జాలి కలిపి ఎక్కువేసి ఇచ్చాను .కానీ వాడు నేను ఎంత అడిగానో అంతే ఇవ్వండి ఎక్కువేమి వద్దు అని డబ్బులు తీసుకు పోయాడు . "time చూస్తే అయ్యగారు ఉదయం 10 గంటలకి వచ్చి మధ్యలో "lunch బ్రేకు తీసుకుని పని అంతా చేసేసరికి సాయంత్రం 5 అయింది .
(ఏమో మరి నాకు మాత్రం ఏం తెలుసు ఎవరు చేసినా అంతే సమయం పడుతుందేమో)

సాయంత్రం మా వారు వచ్చి శివతాండవం చేసారు ఏంటీ door stoppers పెద్దవి పెట్టమంటే  కొబ్బరి పుచ్చులంత చిన్నవి పెట్టాడు ..గాలి బలానికి ఇవి ఆగవు ...
రేపు వచ్చి కొంచం పెద్దవి పెట్టమను ...దేవుడా మళ్ళీ రేపు వీడిని భరించాలా........పోనిలే పాపం మళ్ళీ రమ ఫీల్ అవుతుంది .
మళ్ళీ వాడిని పిలిచి ఒక పూటంతా కూర్చుని తిరిగి చేయించాను, దానికి కూడా వాడు తెగ పని ఉన్నట్టు , నా వల్ల అది పాడై పోయినట్లు ఫీల్ అయ్యాడు .

ఒక ఆదివారం నాడు మా వారికి నగేష్ (carpenter)తో మళ్ళీ పని పడింది ... పోస్టుబాక్స్ కావాలిగా వాడిని చేయమని అడుగుదామా అన్నారు . ఏమో బాబు నాకు తెలీదు మీరే పిలిచి అడగండి . తర్వాత నన్నుతిట్టొద్దు .అని తప్పించుకున్నాను .అయ్య గారు ఉండేది మా ఇంటికి ఎదురుగానే , సార్ పిలుస్తున్నాడు అని బాల్కనీ లోంచి పిలిచాను  ,ఒక అరగంటకి పూలరంగడి లా తయారయి వచ్చాడు .
ఏదైనా ఫంక్షన్కి వెళ్తూ వచ్చాడేమో అనుకున్నా, మా వారు అడగనే అడిగారు ఎక్కడికనా వెళ్తున్నావా ....చిన్న పనుంది ....అందుకే పిలిచాను అన్నారు .లేద్ సార్ మీ పిలచారనే వచ్చాను  ఏంటో చెప్పండి చేసి పడేస్తా అన్నాడు .
మా వారికి వాడి డ్రెస్  కోడ్ నచ్చింది...బావుంది నీ మార్కెటింగ్ స్కిల్ నచ్చింది  .
నాకు ఒక పోస్ట్ బాక్స్ తయారు చేసి ఇస్తావా?
 అన్నా , నీ సొంత వెరైటీ ఆలోచనలు దీనిలో పెట్టకు అన్నాను నవ్వుతూ ..వెంటనే వాడు నా
కేసి కోపంగా చూసి .
మావారి తో ....అలాగే సార్  ఒక రెండు రోజులు "time ఇవ్వండి నేనేంటో నిరూపిస్తా మీకు అని వెళ్ళిపోయాడు . అన్న మాట ప్రకారం రెండు రోజుల తర్వాత పోస్ట్ బాక్స్ తయారు చేసి ఇచ్చాడు .
నిజం చెప్పాలంటే చాలా బాగా చేసాడు వాడు చక్కగా తయారు చేసి దానికి చిన్న చిన్న లతలుగా చెక్కి ఇచ్చాడు ...
మా వారికి కూడా నచ్చింది కానీ ...ఏముంది ఏం బాలే అన్నారు వాడిని ఉడికిద్దామని ...వాడి మొహం చిన్నబోయింది ...అదేంది సార్ అట్లా అంటారు నేను కష్టపడి చేసాను రాత్రంతా కూడా నిద్రపోలేదు ...అందరు బాగుందన్నారు  ....ఏమ్మా బాలేదా,నువ్వే న్యాయం చెప్పు అన్నాడు అక్కడుంటే నన్ను ఇద్దరూ క్రికెట్ ఆడుకుంటారని ..ఒక వెర్రి నవ్వు నవ్వి లోపలికి వెళ్ళిపోయాను .
మొత్తానికి వాడితో కాసేపు వాదించి వాడికి డబ్బులిచ్చి పంపించారు .
 మొత్తానికి భలే పనిమంతుడు వాడు అనుకుంటూ నవ్వుతూ అన్నారు .
ఆ ముక్కేదో వాడి ముందు అంటే కాస్త సంతోషించే వాడు కదా అన్నాను ,అలా అంటే ఇంక వాడు మునగ చెట్టు ఎక్కి రేపు ఏదైనా పని చెప్తే నువ్వు చెప్పినట్టు  వెరైటీ గా చేస్తాడు అందుకే అలా అన్నాను అన్నారు .

కొన్నాళ్ళకి వాడిని మళ్ళీ పిలవాల్సొచ్చింది , మా హాల్లో  కొత్త ఫేన్బిగించాలి అందుకు మా వారు నగేష్ నే పిలిచారు ...అదేంటి వాడిని పిలవడం వాడు కార్పెంటర్ అయితేను అని doubt  వచ్చి మా వారిని అడిగాను ..వాడికి తెల్సిన వాళ్ళు ఉంటారు కదా వాడే తీసుకు వస్తాడు అని చెప్పారు. మొత్తానికి వాడొకడిని  వెంట పెట్టుకుని వచ్చాడు ..
మీరు చూస్తూ ఉండండి నేను చిటికిలో చేసేస్తా అన్నాడు .
సర్లే నాకెందుకొచ్చిన గొడవ నాకు fan ముఖ్యం అనుకుని జరిగే తతంగం చూడటానికి ఎదురుచూస్తూ కూర్చున్నాను . మా వారు వాడి మీద నమ్మకంతో హాయిగా రెండు రోజుల న్యూస్ పేపర్లన్ని ముందేసుకుని చదువుకుంటూ కూర్చున్నారు ...నేను మధ్య మధ్యలో వాడి హావ భావాలు గమనిస్తూ ఉన్నాను ...ఐన్స్టీన్లాగా తెగ ఆలోచిస్తూ పని చేసేస్తున్నాడు  హడావుడిగా.......వీడిని చూస్తూ కూర్చుంటే వంట అయ్యేలా లేదు అని  నేను వంట చేయడానికి లోపలికి వెళ్ళి పోయాను .
ఒక గంట తర్వాత పిలిచాడు సారూ ఒకసారి లోపలి కొచ్చీ స్విచ్చు నొక్కండి అంటూ ..మా వారు స్విచ్చు నొక్కి పైకి చూసారు , అంతే దిమ్మ తిరిగింది ఒక్కసారిగా ...గాట్టిగా కేకలు వేస్తూ  ఎక్కడున్నావ్ ఒక్కసారి ఇలారా అని పిలిచారు ....ఏమైందో అని హడావుడిగా వెళ్ళి చూసాను మా వారి కళ్లు పైకే చూస్తున్నాయ్ ...ఏంటా అని చూస్తే ..ఇంకేముంది నాకు నవ్వాగలేదు పగలబడి ఆపకుండా నవ్వుతూనే ఉన్నాను ...వాడు బిగించిన ఫాను తన గమనాన్ని మర్చిపోయి వెనక్కి తిరుగుతోంది ...సరే ఏమవుతుందో చూద్దామని స్పీడు పెంచుదామని 5 లో పెట్టా అది టక్కున ఆగిపోయింది .హ హ హ అది కూడా మా హీరో గారు తిరకాసు గా బిగించారు .
వాడికి కూడా నవ్వొచ్చింది ...పైగా వాడు ఇదేంటి సార్ ఇలాంటి ఫాను తెచ్చావ్ .... reverse లో తిరుగుతోంది అన్నాడు .పాపం ఏం అంటారు వాడికి పిలిచి పని ఇచ్చినందుకు వాడికొక నమస్కారం పెట్టి డబ్బులు ఇచ్చి పంపిచారు .
మళ్ళి అవన్నీ ఊడపీకి వారు ,నేను కూర్చుని మళ్ళీ బిగించాము .
కొన్నాళ్ళకి మళ్ళీ అదే "electrician  పిలిచి ...కాలింగ్ బెల్ మోగటం లేదు దాని సంగతి చూడు అన్నారు ..వాడు తెగ ఆలోచించి స్విచ్చు మార్చాలి అని మార్చి చూసాడు కానీ వాడి తెలివి పని చేయలేదు . నేను సైలెంట్ గా వెళ్ళి దానిలో బేటరీ మార్చాను , అది పని చేయడం మొదలు పెట్టింది .ఇలాంటి చిన్న విషయాలు గుర్తుండవ్ మేడం అన్నాడు పేద్ద ఫోజుగా.....

ఇలా కాదు గాని నా దగ్గర పాడైపోయిన "dvd ప్లేయర్ ఉంది అది బాగు చేయడం నేర్చుకో అప్పుడు నీకు అన్ని పనులు వచ్చేస్తాయ్ అన్నారు .
అదేంటండి అది 3-ఇన్‌-వన్కదా ప్లేయర్ పనిచేయకపోయినా రేడియో , టేప్ రికార్డర్ పనిచేస్తున్నాయ్ కదా అన్నాను .
దానికి మావారు వాడు వాటిని ఏమి చేయడులే నువ్వు ధైర్యంగా ఉండు అన్నారు. పాపం అసలే పిల్లలు గలవాడు ఏదైనా పని చూపిస్తే వాడే కాస్త నాలుగు రాళ్ళు సంపాదించుకుంటాడు. .
ఎలాగైనా వాడిని మాంచి పనివాడు కింద చేయాలని మా వారి ఆశ .
సరే ఏం చేస్తాం అని ఊరుకున్నాను .
ఎలాగో మా ఇంట్లోనే కూర్చుని కుస్త్తీ పట్టడం మొదలు పెట్టాడు .
ఈ లోగా మా బాబు బస్సు బొమ్మతో ఆడుకుంటూ వాడి పక్కనే కూర్చుని తను కూడా రిపేరు చేయడం మొదలు పెట్టాడు .
ఏంటమ్మా బస్సు పాడయిందా ఆగు నేను బాగుచేస్తా అన్నాడు , సరదాగా అంటున్నాడేమో అనుకున్నా ...

కాసేపటికి మావాడి ఏడుపు వినిపించించి వెళ్ళి చూస్తే బొమ్మ ఏ కీలుకి ఆ కీలు పీకి ఉన్నాయ్ ..వాడేమో ఊరుకో బాబూ ఊరుకో కొత్తది కొంటా అంటున్నాడు ..
హారి భగవంతుడా అనుకుని ..వాడిని అక్కడి నుంచి తీసుకు పోయి ఊరుకోబెట్టి ..
మా వారికి ఫోను చేసి చెప్పాను ..ఏమైనా అనుకోండి నేను మాత్రం ఇంక వీడిని పని చేయనివ్వను ,అని చెప్పి ,వాడిని పంపిచేసాను ,పాపం వాడు బిక్క మొఖం వేసుకుని వెళ్ళిపోయాడు .తర్వాత రోజు రేడియో లో పాటలు విందామని పెడితే దాని లోంచి ఎటువంటి చలనము లేదు ...ఇంకే ముంది మా వారి జాలి కి  ఇది కూడా బలయ్యింది .

ఇంక మళ్ళీ మావారు వాడి పేరెత్తితే ఒట్టు ...కానీ విశ్వస నీయ వర్గాల ద్వార నాకు తెలిసిందేంటంటే ..వాడిని ఇంకా వదలలేదు మా వారు ...మా ఇంట్లో పాడయిపోయిన  బొమ్మలు  అవి వాడి కొలువు కు చేరుతున్నాయి().

మా వారి స్నేహితుడొకడు ఒకరోజు మా ఇంటికి వచ్చాడు . మాటల్లో డైనింగ్ టేబుల్ చేయించుకోవాలనుకుంటున్నాఅన్నాడు అంతే మా వారు నా దగ్గర మాంచి తెలివైన పనివాడు ఉన్నాడు ,పని బాగా చేస్తాడు అని ,వద్దూ అని వెనుక నుంచి నేను సైగ చేస్తున్నా పట్టించు కోకుండా వాడిని పిలిచి పరిచయం చేసారు .ఇంకే ముంది తర్వాత రోజు నుంచి వాళ్ళింటికి వెళ్ళి డైనింగ్ టేబుల్ చేసే పని ఒప్పుకున్నాడు . వీడితో ఇంకెన్ని ఇక్కట్లు వస్తాయో అనుకుని మనసులోనే దేవుడికి ఒక దణ్ణం పెట్టుకున్నా.

 కొన్ని రోజులు ప్రశాంతంగా గడిచిన తర్వాత ఒకరోజు మావారు సణుక్కుంటూ ఇంటికి వచ్చారు , మంచినీళ్ళిచ్చి చూస్తూ నిల్చున్నాను ..మళ్ళీ లోపలికి వెడితే ఎందుకో అడగలేదు అంటారు , అడిగితే ఇప్పుడేగా వచ్చాను అప్పుడే చెప్పాలా అంటారు  .
  
మా వారే చెప్పారు మా వజ్రం గారిని డైనింగ్ టేబుల్ చేయమని చెప్పారు కదా ... (revolving daining table )టేబుల్ మధ్యలో disc  లాగ తిరిగేటట్లు పెట్టమంటే ....వాడు తన వెరైటీ ఆలోచనతో టేబుల్ మాత్రం తిరిగేట్ట్లు పెట్టాడట లోపల ది మాత్రం కదలకుండా ఉందిట.
 మరి వాడిని ఎందుకలా చేసావ్ అని అడగలేదా? 
హా..అది కూడా అయ్యింది ....ఇదే ప్రశ్న వాడిని అడిగితే "సూపర్"  లో షిండే లాగ నా పక్కనే కూర్చుని బాగా చేయ్ , జాగ్రత్తగా చేయ్ , ఆలోచించి చేయ్ అని మీ ఫ్రెండు నా బుర్ర తిన్నాడు అని చెప్పాడు ,

         ఏది ఏమైనా వాడు అలా కూడా భలే ఆలోచింది పెట్టాడు కదూ ???





Tuesday, December 13, 2011

అల్లుడుగారు ...అత్తారిల్ల్లు


రాజేష్ పుట్టి పెరగడం అంతా పట్నం లోనే కావడం వల్ల ఏరి కోరి పల్లెటూరి లోనే పుట్టి పెరిగిన రజని ని  చేసుకున్నాడు .అత్తగారు వాళ్ళు పెద్ద (సంక్రాంతి) పండగకి పిలిచారు .
పల్లెకు పోదాం ...ఊరులు చూద్దాం చలో చలో
ఎంజోయ్ చేదాం చలో చలో....పొద్దువాలే ముందుగానే ముంగిటవాలేనో  ,అనుకుంటూ అత్తారింటికి ఆనందంగా బయలుదేరాడు.ముందురోజు పొద్దునే ఎక్కిన మనిషి "direct బస్సు లేక నానా అగచాట్లు పడుతూ,తర్వాతి రోజు పొద్దువాలిన తర్వాత  అత్తారింటికి చే్రుకున్నాడు .రాత్రి భోజనాలు చేసి పడుకునే ముందే రజని తో చెప్పాడు నేను లేచేవరకు నన్ను ఎవ్వరు లేపడానికి వీల్లేదు  అని .

తెల్లవారింది భోగి పండుగ హడావుడి మొదలయింది ,లీలగా ఎక్కడనుంచో హరినామ సంకీర్తం వినిపించి రాజేష్ కి మెలకువ వచ్చింది "time చూస్తే ఉదయం 6 గం|| .బద్దకంగా ఒళ్ళు విర్చుకుంటూ బయటకి వచ్చాడు.అరే విచిత్రంగా ఉందే ఎప్పుడూ లేనిది ఏంటి ఇంత పొద్దునే లేచారు అంటూ ఎదురొచ్చింది రజని ,ఏమోనోయ్ నిద్రరావటం లేదు అందుకే లేచేసా
సర్లే కాని కాఫీ ...అని నసిగాడు !!!, 
ముందే చెప్పాగా మా ఇంట్లో బెడ్ కాఫీ నిషేధం .మా అమ్మ చచ్చినా ఇవ్వదు....
మాట పూర్తయ్యే లోగానే అమ్ములూ ఇలా రావే అంటూ  తల్లి పిలుపు వినిపించింది .తల్లి.. చేతిలో కాఫీ గ్లాసు పట్టుకుని కూతురి చేతికిచ్చి అల్లుడుగారికిచ్చిరా అంది, రజనికి ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నట్లయింది 
.అదేంటమ్మా నువ్వూ....అంటూ ఆగిపోయింది ,
నోరుమూసుకుని చెప్పిన పని చేయ్  ఆరాలు తీయకు అని మడి సరిచేసుకుంటూ మళ్ళీ రాముడి ని స్మరిస్త్తూ వంటింట్లోకి వెళ్ళిపోయింది .వెనకనుంచి  కిసుక్కున నవ్వు వినపడింది చూస్తే తమ్ముడు నవ్వుతూ నిలబడ్డాడు .
అక్కోయ్ అల్లుడి మర్యాదలంటే ఇవేనేమోనే , మన బావే మన ఇంటికి మొదటి అల్లుడు కదా అందులోను దూరపు సంబంధం కదా ,అందులోను పట్నం అల్లుడు


నాన్న సంగతే తీసుకో ఒరేయ్ సూరిగా, ఒరేయ్ తమ్ముడూ అంటూ అమ్మమ్మ నాన్న కే ఎదురు పనులు చెప్తూ ఉంటుంది,మన బాబాయ్ లు అందరిది కూడా ఇంచుమించు అదే పరిస్థితి మన  అత్తలు అందరూ కలిసి వాళ్ళని ఆడేసుకుంటూ ఉంటారు . మనవాళ్ళని పిన్ని అని పిలవాలో వదినా అని పిలవాలో వరుసలతో సతమత మై పొతున్నా అనుకో  :(. ........
కాఫీ చల్లారపోయేలా ఉంది ముందు అది ఇచ్చి తర్వాత అక్క తమ్ముళ్ళు తీరికగా బాధ పడుదురుగాని ,మళ్ళీ తల్లి కేకలేసింది .

కాఫీ తీసుకుని పెరట్లో అరుగు మీద కూర్చున్నాడు ,అక్కడ పిన మావగారు పనస పొట్టు కొడుతున్నాడు  ,మధ్యలో వదినా కాఫీ అని అరుస్తున్నాడు .పాపం ముఖం కడుక్కుని గంటైనా కాఫీ లేక అల్లాడుతున్నాడు.ఇంతలో రాజేష్ కాఫీ తాగడం అయ్యింది ,తనుకూడా పనసపొట్టు కొడతానని బ్రతిమాలి చేతిలోంచి లాక్కునంత పనిచేసి నెమ్మదిగా కొట్టడం మొదలు పెట్టాడు
చూసావా ఆఖరికి మీ నాన్న కూడా ఏం చేస్తున్నాడో పక్కనున్న రాగిణి  నెత్తి మీద మొట్టి అన్నాడు సదరు పెద్ద బామ్మర్ది శ్రీరాం .
ఏం చేసాడేం అంది రాగిణి ,ఇంకా ఏం చేయాలి ఎన్ని సార్లు అడిగానో నేను ఒక్కసారి పనస పొట్టు సరదాగా కొడతా అని,  ఇచ్చాడా పైగా చిన్నోడివి నీకేం రాదు అవతలికి ఫో అన్నాడు  X-/, నేనేం చిన్నా వాడినా చితక వాడినా ...మహా ఐతే బావకి నాకు 15 సం|| తేడా అంతే …  
అంతేరా అన్నాయ్ కొత్త అల్లుడంటే అలాగే ఉంటుంది , మళ్ళీ ఇద్దరు కూర్చుని బాధపడటం మొదలుపెట్టారు .

ఎపుడైనా రామూ అడిగితే నూనె  మాలీష్ చేయరా అంటే పెద్దోరయ్యారు మీకెందుకు బాబు అనే రంగయ్య ,వద్దు వద్దంటున్నా అల్లుడిగారికి నూనె మాలీషులు చేసాడు.అంతా చూస్తూ ఉన్నాడు రాము. 
ఇది అంతం కాదురా ఆరంభం; 
చిన్న తమ్ముడు లచ్చి బాబు(లక్ష్మణుడు ) వచ్చి పక్కన కూర్చుని గంభీరంగా సెలవిచ్చాడుఆ ఏడిసావులే నోరుమూసుకో .

ఉదయం బాలభోగం పేరుతో దధ్యోజనం ఉంటుంది అదే టిఫ్ఫిను ..బ్రేకుఫాస్టు అనుకున్న వాళ్ళందరికి ఆశాభంగం కలిగిస్తూ ...ఇడ్లీ,వడా,దోశా కనిపించాయ్
ఓర్నాయనో ఇదేదో బాగా దారుణంగా ఉంది  అనుకున్నారు పిల్లలందరు .

హమ్మయ్య ఇంక అలా తిరిగొద్దాం అని బయలు దేరాడు రాజేష్ ,ఇంతలో పినమావగారు ఎదురొచ్చి ఒక్కరు ఏం వెళతారు ఆగండి అని ఒరేయ్ రామూ కాస్త బావ తో పాటు బయటకి వెళ్ళి ఊరంతా చూపించరా అని పిలిచాడు .నేనంటే నేనంటూ కొట్టుకుని ఆఖరికి రామ ,లక్ష్మణులిద్దరూ బావ గారికి ఊరు చూపిద్దామని బయలు దేరారు. దారిలో వాకిళ్ళలో ఉన్న రంగవల్లులూ  , భోగి మంటలు చూస్తూ దణ్ణాలు పెట్టుకుంటూ ఆ ఊరి రచ్చబండ దాకా వెళ్ళిన తర్వాత ,

అల్లుడు గారు ఎప్పుడొచ్చారు అంటూ అడిగాడు ఒక పెద్దాయన ,
ఎవర్నబ్బా అని అటు ఇటూ తలతిప్పాడు ,
మిమ్మల్నే బాబూ మీరు ఆ ఇంటికి అల్లుడంటే మా అందరికి అల్లుడుగారి కిందే లెఖ్ఖ అన్నాడు .
వెనక్కాల నుంచి బావమరుదులిద్దరు నోళ్ళు మూసుకుని నవ్వుకుంటున్నారు భలె భలె అనుకుంటూ .

కొంత ముందుకెళ్ళిన తర్వాత ఒక చిన్న పూరింటి పైన పేద్ద ఆనపకాయ నవనవ లాడుతూ కనిపించింది .
ఒరేయ్ అది "సొరకాయ" కదూ అడిగాడు..
కాదు బావా "ఆనపకాయ" నవ్వాపుకుంటూ బదులిచ్చాడు .
ఏదయితేనేం కాని వాళ్ళిస్తారేమో కనుక్కో అన్నాడు ,
వెంటనే శీనూ శీనూ అంటూ లోపలికి దూరి ,అతనిని బయటకి తీసుకువచ్చాడు 
,వాడు మెలికలు తిరుగుతూ మొహమాట పడిపోతూ అయ్య బాబోయ్ అల్లుడు గారాండి,
ఏం కావాలండీ ఆనక్కాయ నేను పంపుతా మీరెళ్ళండి అంటూ తెగ మర్యాదలు చేసేసాడు.
మరి డబ్బులు అంటూ జేబులోంచి డబ్బులు తీయబోయాడు..
మంచోరే డబ్బులిత్తన్నారా ఇంకా నయం పెద్దయ్య గారికి తెలిసిందంటే నా తాట తీసేత్తారు ..మీరెళ్ళండి బాబూ మీరెళ్ళండి అంటూ సాగనంపాడు .

ఊరంతా తిరిగి తిరిగి ఇంటికొచ్చారు ...అరుగు మీదే కూర్చుని ఎదురుగా ఉన్న చెరువులో వాలిన కొంగలను చూస్తున్నాడు ..ఈలోగ ఒక జోలె లాంటిది పట్టుకుని చిన్న పిల్లలు పదిమంది వచ్చారు .

ఎప్పుడెప్పుడు పండగా ...ఏడాది పండగా ...
పండగెందుకొచ్చింది ...పప్పులు తిండానికొచ్చింది
కూతురెందుకొచ్చింది ...కుడుములు తిండానికొచ్చింది
అల్లుడెందుకొచ్చాడు ..అరిసెలు తిండానికొచ్చాడు .

ఆఖరి లైను మాత్రం మళ్ళీ మళ్ళి పాడసాగారు.ఏదో పరధ్యానం లో వింటున్న వాడు ...మళ్ళి మళ్ళి పాడేసరికి సరిగా విని పిల్లల కేసి చూసి నవ్వసాగాడు .
వాళ్ళు  మళ్ళీ  ఆ లైను వదిలి
వేసినోళ్ళకి  పుణ్యం ...వేయనోళ్ళకి పాపం
అంటూ పాడటం మొదలుపెట్టారు .ఇంతలో లోపలి నుంచి పిన్నత్తగారు వచ్చి బియ్యం ..ఇంకా ఏవేవో కూరగాయలు వాళ్ళ జోలెలో వేసి వెళ్ళిపోయింది .
అసలు ఎందుకు అలా వాళ్ళు పాడుకుంటూ జోలె పట్టుకుని వస్తున్నారు,  
అక్కడే ఉన్న రాగిణి ని అడిగాడు 
పాపం మనకైతే పండగలు పబ్బాలు ఉంటాయ్ బావ 'కాని మూగ జీవాలకి ఆ అవకాశం లేదు కదా 
అందుకే  పిల్లలంతా కలిసి  ఇలా సంపాదించి వండి Stray dogs కి పెడతారు అని చెప్పింది .
ఓహో ..
అయితే అయ్యిందిలె గాని వాళ్ళు నాకు అరిసెలు గురించి గుర్తు చేసారు అవి కూడా ఉంటే భలే ఉంటుంది అన్నాడు .
లోపలికి వెళ్ళి బావకి అరిసెలు కావాలిట అంటూ వాళ్ళమ్మ తో చెప్పింది .
అప్పటికప్పుడు అరిసెలంటే ఎలా. వెంటనే పక్క వీధిలో ఉండే వాళ్ళ అక్క కి ఫోను చేసి అరిసెలు సంగతి పురమాయించింది
మళ్ళీ గుర్తొచ్చి రాగిణి ని పిలిచి జున్ను దొరుకుతుందేమో కనుక్కో అన్నాడు
మళ్ళీ ఆ వార్త చేరవేసింది .
మళ్ళి వేరే ఊళ్ళొ ఉంటున్న తమ్ముడికి ఫోను చేసి ఎంత త్వరగా ఐతే అంత త్వరగా నువ్వు తెవల్సిందే అంటూ హడావుడి పెట్టేసింది .
మళ్ళీ వెళ్ళి కాసేపు  పడుకుందామా అనుకుంటుండగా డప్పు వాయించుకుంటూ ఒకడు వచ్చి నిల్చున్నాడు
వెనుకే గరగను నెత్తిమీద పెట్టుకుని (ఇత్తడి బిందెలాంటి దానిపైన సర్పం ఆకారమ్లో చీరలతో కప్పి ఉంటుంది ) ,కాళ్ళకి మువ్వలు కట్టుకుని ఘల్లు ఘల్లు మనుకుంటూ వచ్చాడు
లచ్చిబాబు ,రాగిణి లోపలనుంచి ఇద్దరూ కొట్టుకుంటూ వచ్చి వాళ్ళచేతిలో ఉన్న పసుపు నీళ్ళు  చెంబుతో సహా అతని కాళ్ళ మీద పడేసారు ,
రజని తన చేతిలో ఉన్న బియ్యం ప్లేటు అతని చేతికి అందించింది . తన దగ్గర ఉన్న పసుపు , వేపాకు ఆ ప్లేటు లో పెట్టి మళ్ళీ ఘల్లు ఘల్లు మని కుంటు కుంటూ వెళ్ళిపోయాడు .
ఏమిటిది అని అడిగేలోపే ..  
పంటలు బాగా పండిన ఏడాది గ్రామ దేవతకి  జాతర చేస్తారు ఆ విధంగా రక రకాల ఆటగాళ్ళకి ,పాటగాళ్ళకి ,వేషాల వాళ్ళకి కూడా పని దొరుకుతుందని అని చెప్పింది రాగిణి . ఇంకో రెండు రోజులలో జాతర జరుగుతుంది .
ఇవన్నీ నీకెవరు చెప్పారు తల్లి  
ఇంకెవరు మా పెద్దనాన్న అని తుర్రుమని లోపలికి పారిపోయింది .

దేవుడికి పెట్టేసావు కదా నువ్వు మాకు అన్నం పెట్టవు ఏంటమ్మా ఇది   
లచ్చి బాబు గోల చేయడం మొదలు పెట్టాడు .
పోనిలే పిన్ని,పాపం పిల్లలకి పెట్టేయొచ్చు కదా అంది రజని .
ఇంకా నయం అల్లుడికి పెట్టకుండా తినకూడదు తప్పు అంటూ లెంపలే్సుకుంది.

ఒరేయ్ లచ్చి ,రాగిణి ,రాము ఇలా రండిరా పెద్దనాన్న పిలిచాడు వాళ్ళందరిని ఆయన చేతిలో దొంగతనంగా వంట గదిలోంచి తీసుకొచ్చిన అరిసెలు ఉన్నాయ్ ..
మెల్లగా ఎవరికి తెలియకుండా తినేసి రండి అని ,ముఖ్యంగా మీ పెద్దమ్మకి తెలియకూడదు ...
అని,అక్కడి నుంచి త్వరత్వర గా వెళ్ళిపోయాడు .

ఆదరాబాదరా జున్ను తీసుకుని పక్క ఊరినుంచి రాగిణి మేనమమ కూడా వచ్చాడు .
చూడవే మావయ్య ఒక్కసారి కూడా జున్ను తే మావయ్యా అంటే తేడు 
ఈ రోజు చూడు బావ కోసం "helicopter వేసుకుని వచ్చాడు అన్నాడు రాము ,రాగిణితో..
అంతా చూస్తున్నాలే కాని ముందు నువ్వు మూతి తుడుచుకో పెద్దమ్మ చూసిందంటే పెద్దనాన్న గతి ఇంతే ...

అందరూ భోజనాలకి కూర్చున్నారు ..అల్లుడుగారికి ఒక్కసారిగా ఎస్.వి .రంగారావు గారు గుర్తొచ్చారు .ఆయన మాయాబాజార్ లో తిన్నపదార్ధాలు కనిపిస్తున్నాయ్ కళ్ళముందు .ఇతనడిగిన లిస్టుతో కలిపి చాలా ఉన్నాయ్వద్దు మొర్రో అంటున్నా ఇది మీరడిగినవే ...ఇది మీరు ఊరికొచ్చేముందు చెప్పినవే అంటూ బలవంతాన మావ గారు ,పిన మావగార్లు అందరూ కలిసి తినిపించేసారు .ఎట్టకేలకి భోజనమయింది .హమ్మా హబ్బా అనుకుంటూ లేచాడు .


తాంబూలం తీసుకొచ్చి ఇచ్చింది భార్యామణి నవ్వాపుకుంటూ..
ఏం వేళాకోళంగా ఉందా ...అసలు పొట్టలో ఖాళీ ఎక్కడుందే తాంబూలం వేసుకొవడానికి అని కసిరి భారంగా నడచుకుంటూ వెళ్ళాడు ….
అప్పుడు గుర్తొచ్చింది ,వాళ్ళ స్నేహితుడు ...అదే ఊరికి మరో అల్లుడు అయిన రమేష్ అన్న మాటలు 
" ఒరేయ్ పొరపాటున నోరు జారి ఇది కావాలి అది కావాలి అని అడగకు తర్వాత వద్దు మొర్రో అన్నా వినరు  అసలే ఆ ఊరివాళ్ళు మర్యాదలకి పెట్టింది పేరు రా "... ...
ఓరి దేవుడా వాడి మాట పట్టించుకోలేదు ఇప్పుడు అనుభవిస్తున్నాను అనుకుంటు వట్టి నేల మీదే పడుకుని దొర్లడం మొదలు పెట్టాడు .
అల్లుడి గారి వింత ప్రవర్తన చూసి బుగ్గలు నొక్కుకున్నారు అత్తలందరూ...
ఏమే మీ ఆయనకి ఏమన్నా పైత్యం ...చిత్త చాంచల్యం లాంటివి ఉన్నాయా అని రజని ని పిలిచి అతనిని చూపిస్తూ అడిగారు ...
ఒక్క నవ్వు నవ్వి ..లేదమ్మ మీ మర్యాదలకి ఆనందం తో తట్టుకోలేకా అలా దొర్లుతున్నారు …....
ఆ ఆ ఆ  :-\ .......
ఇంక పిల్లల సంగతి సరే సరి బావ గారు బాధతో దొర్లితే ...వీళ్ళు ఆనందం తో దొర్ల సాగారు ....