ఎవరైనా మాటలు మొదట అమ్మ అనే పదంతో మొదలు పెడతారు ...నేను మాత్రం వదిన అని మొదలు పెట్టాను ...??????
పిలిచింది ఎవరినో కాదు మా అమ్మనే ..మా బాబాయ్ లు అందరు మా అమ్మని వదినా అని పిలుస్తుంటే నేనుకూడా ..మా అమ్మ,నాన్నల్ని వదిన , అన్నయ్య అని పిలవడం మొదలు పెట్టానట .
విచిత్రంగా ఉంది కదూ నా వరస.
అవును మరి దానికి రెండు కారణాలు ఉన్నాయని నా సందేహం ..
నంబర్ 1 :మా అమ్మ ఎదురుచూసి చూసి పిల్లలు ఇక పుట్టరు అనుకునే సమయం లో ఇదిగో నేనున్నా అంటూ నేను పుట్టేసి అందర్నీ సంబరపెట్టేసాను మరి , అందువల్ల నేను అలా వింతగా ప్రవర్తించి ఉండొచ్చు .
నంబర్ 2: మా నాన్న చిన్నతనం నుంచి వాళ్ళ బాబాయ్ ,పిన్ని దగ్గరే ఉండే వారు. పిన్ని పిన్ని అని పిలవడం విని మా బాబాయ్ కూడా మా నాన్నమ్మ (వాళ్ళ అమ్మే మరి ) ని పిన్ని అని పిలిచేవాడు , నిజ్జ్జం నేను కూడా విన్నాను ,ఒకవేళ మరి నాకు కూడా ఆ గాలి సోకిందేమో మరి .
అసలు నా సంగతి కొద్దాం ..మరి వదినా అని పిలిస్తే ఊరుకున్నారా మరి అంటే ....
ఊరుకుంటారేంటి మా నాన్నమ్మ నన్ను పిలిచి , మరి నేనేమో నాన్నమ్మ ని కదా , మరి తనేమో వదిన ...ఇంతకీ మీ అమ్మ ఎవరు అని అడిగిందిట , నేను అప్పుడు " ? "ఇలా పెట్టానట నా ఫేసు ...పోనీలే వదినని , అన్నయ్య ని అమ్మా ,నాన్న అని పిలు అని చెప్పిందిట.
నాకేమో మరి మా నాన్నమ్మ చెప్పింది , మా బాబాయ్ కి వాళ్ళ నాన్నమ్మ చెప్పలేదు మరి అందుకే ఎప్పుడు పిన్ని అనే పిలిచేవాడు ....
మరి అమ్మ అని ఎవరిని పిలిచాడో అని నాకు చిన్న సందేహం ..ఈ సారి అడగాలి అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను కాని ఎందుకో పాపం అడగలేదు ఇప్పటి వరకు ....
ఇంక నేను అమ్మ అని పిలవడం అలవాటయ్యింది మా అమ్మకి ...మరి వదిన అని పిలిచినప్పుడు ఫీల్ అయిందేమో మరి నాకు తెలీదు ...అడగలేదు (తిడుతుందేమో అని భయం).
కొన్ని రోజులకి మా ఇంటికి ఒక చుట్టం వచ్చింది ..ఆవిడని నేను పెద్దమ్మ అని పిలవడం మొదలు పెట్టాను ....ఆవిడేమో అదేవిటే ఆ పిలుపు ???నేను నీకు పిన్ని నవుతాను,మీ అమ్మ నాకు అక్కవుతుంది అంది .ఏమో మరి నువ్వు మా అమ్మకన్నా చాలా లావుగా , పొడుగ్గా ఉన్నావ్ అందుకే నిన్ను నేను అలాగే పిలుస్తా ..మళ్ళీ మొన్న ఎప్పుడో కలిసింది మామూలుగా పెద్దమ్మా అని పిలవబోయి నాలిక్కరుచుకుని పిన్ని అన్నాను , మళ్ళీ పిలుపు మార్చావేమే అని అడిగింది ,
మరి ఇప్పుడు నువ్వు సన్నగా అయ్యావు , నిన్ను పెద్దమ్మ అని పిలిస్తె బాగోదని ఇలా అని నవ్వేసా, తను కూడా నాతో పాటు నవ్వేసింది .
పిన్ని వాళ్ళ తమ్ముడిని ఏమని పిలవాలి మామయ్య అనే కదా ....మరి అమ్మా వాళ్ళ అన్నయ్య ని ? మామయ్యే కదా మరేమో ఈ ఇద్దరూ తండ్రి కొడుకులైతే ఇద్దర్నీ ఏమని పిలవాలి ....అందుకే ఇద్దరూ నాకు మావయ్యలే ..మరి ఈ వరసేంటో..మా అత్త అడుగుతూ ఉంటుంది ఇద్దరూ మావయ్యలేనా అని.మళ్ళీ మావయ్య వాళ్ళావిడేమో నాకు అక్క ..మరి తను ఇంకో పిన్ని కూతురు , మళ్ళీ వాళ్ళ నాన్నేమొ నాకు అన్నయ్యో , బాబయ్యో అర్ధం కాదు .... మా అక్క వాళ్ళ నాన్న మా అమ్మని పిన్ని అని పిలుస్తాడు .... X-\, అంతగా ఐతే వదినా అని పిలవాలి కాని , అంటే మా అమ్మ వాళ్ళ అమ్మకి చెల్లెలు అంటాడు ..మళ్ళీ నన్ను చెల్లాయ్ అంటాడేమో అని భయమేసి ...నోరు క్లోజ్ చేసి ...టింగ్ అన్న మాట.మరి ఆ బాబాయ్(అన్నయ్య) నాకు పెద్దమ్మ కొడుకు మరి ....ఏంటొ మరి ఆ పిన్ని నాకు వదినే అవుతుంది కదా ..మరేమో తను మా పిన్ని కి అక్క మరి ...ఏంటో బాబోయ్ ఈ వరస .అందుకే నాకు ఆ టైం లో గుర్తొచ్చిన వరుస తో పిలిచేస్తూ ఉంటాను .
ఇదంతా ఒక గొడవైతే మరి ఇంకో పిన్ని కొడుకేమో నా కన్నా వాడు 2 ఏళ్ళు పెద్ద ఐనా కూడ వాడు నన్ను అక్కా అని పిలుస్తాడు ...ఎందుకో తెలుసా....సేమ్ లాజిక్ ...వాడికన్న నేను చాలా పొడుగు .... :(..వాడి పిచ్చి లాజిక్ తో మా అక్కలు కూడా నన్ను అక్కా అని పిల్చేస్తున్నారు పైగా :-'( ....
ఆ వరస పక్కన పెట్టి ఇంకో వరసలోకి వస్తే మా పిన్ని ఉంది కదా...అదే ఇంకో పిన్ని లెండి ..తను నాకు అచ్చంగా పిన్నే ,కానీ మా పిన్ని వాళ్ళ నాన్నని ,మా అమ్మ అన్నయ్యా అని
పిలుస్తుంది . మళ్ళీ ఇదో గొడవ , వాళ్ళేమైనా పిలుచు కోనీ ...నా దారి మాత్రం ఈ సారి రహదారే ...ఆయన నాకు తాతంటే తాతే అని ఫిక్స్ అయిపోయా.
నాకో అన్నయ్య ఉన్నాడు మళ్ళీ ...వాడేమో మా పెద్ద నాన్న కొడుకు మరి అన్నయ్యే కదా...మా అమ్మ మళ్ళీ వాళ్ళ అమ్మని అత్త అని పిలుస్తుంది ...మా వదినేమో మా అమ్మని
అక్కా అంటుంది , ఎక్కడ చూసినా మా అమ్మ వల్లే వరుసలు మారుతున్నాయ్ అని అనుకుంటే పొరపాటు ..మా అత్తల వల్ల కూడా ప్రోబ్లం వచ్చింది .
మా ఈ అన్నగాడేమో ఒక అత్తకి తమ్ముడు ...ఒక అత్తకి మరిది ట ట ...చూసార వింత గా మారిపోయింది ...మా పెద్దత్త కూతురేమో మావయ్య అంటుంది వాడిని ...మా చిన్నత్త కొడుకేమో బాబాయ్ అంటాడు .వీళ్ళిద్దరు కలిసి నా బుర్ర తిని నువ్వు ముందు ఎవరి పార్టీ నో తేల్చుకోమన్నారు , ఏం నేనే ఎందుకు మీ పార్టీకి రావాలి ...అంతగా ఐతే గియితే మీరే నా పార్టీలోకి రండి , పాపం వాడు కూడా చిన్నవాడే కదా సంతొషిస్తాడు ఇంకా మరేమో ఎంచక్కా చాకీ ఇస్తా, ఆవకాయ్ ముక్క పెడతా అన్నా.....చస్ వీల్లేదన్నారు ఆ ఇద్దరు ...ఐతే ఫొండి అని నేను మాత్రం అన్నయ్యకే ఫిక్స్ ...మా ముగ్గురం లో ఎవరు ఎలా పిలిచినా పలకడం వాడి వంతు అయిపోయింది పాపం .మా అందరి కన్నా తెలివైనది ఇంకొకత్తి ఉంది మా చిన్న అత్త కూతురు దానికి అస్సలు ఈ విషయాలేమీ తెలీవు పాపం ఈ సారి అది ఏమని పిలుస్తుందో చూడాలి ..చుట్టాలంటే అందరూ ఒకటే "caste లో వాళ్ళే ఉంటారా? పెద్ద తాతయ్య అంటే ఎవరు ఆయన మనకి చుట్టమేనా ? మీరు మేము ఒకే "community నా ? ఐతే మీ అమ్మ , మా నాన్న సొంత వాళ్ళేనా ? ఇవి దాని "doubts .
మా ఊళ్ళో ఒక పేద్దావిడ ఉండేది అంటే మరి ఎందుకో తెలుసుగా అలా పెద్దావిడన్నమాట ఆవిడని మా అమ్మ పిన్ని అంటుంది , మా నాన్న అత్త అంటాడు ,ఈ సారి మా నాన్న కూడా
ఈ విషయం లో తన వరస దూర్చాడు మరి అందుకే ఇన్నాళ్ళు అమ్మ కోసం వరుసలు పెట్టి పిలిచాను ..ఈ సారి అలాగే ఉంటే నాన్న ఫీల్ అవుతాడు ..పోనీలే నాన్న కదా అనుకుంటే,అమ్మ హన్నన్నా అనుకుంటుంది అని నేనే ఒక కొత్త వరుసతో పెట్టి " పాపత్తయ్యమ్మమ్మ " అని పేరు పెట్టేసా...
హమ్మయ్య పెళ్ళైపోయింది ,ఇంక ఈ వరసల గోల ఉండదు అనుకున్నా....అతడి కంటే ఘనుడు అన్నట్లు ..మా వారు నాకంటే చాలా తెలివిగా ఆలోచింది (పాపం అప్పట్లో తెలివిగానే
ఉండేవారు , మరి ఏమైందో మధ్యలో ..ఈ మధ్య బొత్తిగా తెలివి అంటే ఏంటి అనే స్థితికి వచ్చారు ..పాపం ..నాకేం తెలీదు ఎందుకో మరి అలా పాపం ) అందర్నీ అక్కా అని పిలిచేవారు
..ఆఖరికి వాళ్ళ సొంత మేనత్తల్నీ అంతే ,మేన మామ భార్యల్ని అంతే .హమ్మ బాంబోయ్ ..మా వారి మాట వింటే ఇంక అంతే అని మా అత్తగారిని అడిగి తెలుసుకుని పిలుచుకుంటూ
ఎలాగో కాలక్షేపం చేస్తున్నానా...ఇంతలో
మా చెల్లి రాక్షసేమో అర్జంటుగా మా బుజ్జి మావయ్యని పెళ్ళి చేసేసుకుంది ఇప్పుడు నేను మా మావయ్యని ఏమని పిలవాలీ ??????

