Pages

వాసంత సమీరంలా నులివెచ్చని గ్రీష్మం లా సారంగ సరాగం లా అరవిచ్చిన లాస్యం లా.......ఒక శ్రావణ మేఘం లా.......ఒక శ్రావణ మేఘం లా ...శరత్చంద్రికల కలలా.....హేమంత తుషారం లా నవ శిశిర తరంగం లా..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ....సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

Showing posts with label జ్ఞాపకాలు. Show all posts
Showing posts with label జ్ఞాపకాలు. Show all posts

Tuesday, August 23, 2016

కథ కంచికి....

ఎట్టకేలకు విలన్ చచ్చాడు!చంపబడ్డాడు!
అందరికీ దర్శనం టోకెన్ ఒకేసారి దొరికినట్లు....
ముహూర్తం చూసుకుని...
హత్య జరిగిన రోజే నలుగురు సందర్శకులు విలన్(చావు) కి అవసరమా???
       
విడివిడిగా వెళ్లొచ్చుగా, త్వరగా సినిమా               ఐపోయేది !

          ఇంతకీ హంతకుడు/రాలు ఎవరు? ?

(పక్కింటి బామ్మ)చచ్చాడు వెధవ,పీడాపోయింది!
బామ్మా కరెంటు పోయింది ,
పోతేపోయింది ,వెధవ చచ్చాడు ...
వెధవది వెధవ కరెంటు!
కరెంట్ వాడి ఇంట్లో కూడా కరెంటు పోవాలి..
ఇంతకీ ఎవరు చంపారో?

25 ఏళ్ల క్రితం మాట ..

కరెంటు పోయింది, నా డౌట్ అలాగే ఉండిపోయింది
అచ్చతెలుగు ఛానెల్ దూరదర్శన్ లో
 ఆదివారం సినిమా
అప్పట్లో .....
ఇన్వర్టర్ లేదు  ..
ఇంటర్నెట్ లేదు స్ట్రీమ్ వాడటానికి
కేబుల్ లేదు వారానికే మళ్లీ చూడటానికి,
స్కై ప్లస్ లేదురికార్డు చేయటానికి :(

సోమవారం స్కూల్ లో అడిగా,మాకూ కరెంటు పోయిందే :'(
హీరోయిన్ ని అరెస్టు చేస్తారేమోనే , మా ఫ్రెండ్ ఏడుపు
సర్లే ! నెక్స్ట్ సం || వచ్చినపుడు మళ్ళీ చూద్దాం ఏడవకు
ఈలోగా హీరోయిన్ కి ఉరిశిక్ష పడదు కదా! !!!
పడదు , ఇంకా చాలా సినిమాల్లో సేం పోలీసు , టైం దొరకదు లే
అయినా సమ్మర్ లో హైదరాబాద్ వెళ్తా కదా ,
ఊ..ఊ..
వాడు కనిపిస్తే చెప్తాలే..

మళ్లీ 6 నెలలకే సినిమా వచ్చింది. .
చూస్తూ ఉన్నా , మా ఇంటికి చుట్టం వచ్చింది. ..
మా ఫ్రెండ్ ఊరెళ్ళింది..
లాభం లేదు. . ఈ చుట్టాలకి పనిలేదు
సుబ్బు బాబయ్య ఇల్లు కరెక్ట్! ఇప్పుడే వస్తా ..
బాబాయ్ కూడా టెన్షన్ లో ఉన్నాడు..
విలన్ చావడానికి సిద్ధంగా ఉన్నాడు. .
కరెంటు పోవడానికి సిద్ధంగా ఉంది..
చూస్తూ. ... ఉన్నాం...
అర్రె ..అమ్మలూ మళ్లీ కరెంటు పోయిందే
ఆ వెధవ చావడం , కరెంట్ పోవడం
పీడాకారం వెధవ , ఈ సారి ఆ వెధవ చావకుండా చూడు సామీ _/|\_
ఒక 5 పై|| వేస్తా (బామ్మ మొక్కుకుంది)

ప్రతి ఆదివారం సినిమా వచ్చేది , కానీ ఆ సినిమా మళ్లీ రాలేదు !!!
ఎదిగే హడావుడి లో  "ఆదిగాడి అమ్మ" ఆ సినిమా పేరు మర్చిపోయింది,అప్పుడప్పుడు దూరదర్శన్ పెట్టటం మర్చిపోలేదు ...

ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ సినిమా ...అదే సైనిమా
వచ్చింది. ..వచ్చింది...
విలన్ చచ్చాడు. .చంపబడ్డాడు
చిన్న బ్రే.....క్
పీడాపోయింది (ఈసారి నేనే)

కర్కశంగా కాలింగ్ బెల్ మ్రోగింది
పనమ్మాయ్...
హమ్మో..బ్రేక్ అయిపో... వచ్చింది. .
బర్రుమని లోపలకు లాగి తలుపేసి షాక్ తో ఆ పిల్ల అరిచేలోపే కిచెన్ లోకి తోసి
  " ఈ రోజు గిన్నెలు తక్కువున్నాయ్ కావాలంటే ఓ పది ఎక్కువ తీస్కో నస పెట్టక పని చేసుకో"
కంటిన్యూ...ఇప్పుడే స్టార్ట్ ఐంది

ఎన్నో మలుపులు మధ్యలో మరెన్నో పనికిమాలిన ముఖం , బట్టల సబ్బు లు, మూతి ముఖం పేస్ట్ లు వచ్చాకా...

సినిమా సస్పెన్స్ కి తెరపడింది...
నా డౌట్ తీరింది. .

పనమ్మాయ్ డబ్బులడిగింది...


సినిమా పేరు చెప్పలేదు కదూ !!!!

పేరు. .పేరూ..మర్చిపోయా ..మళ్ళొచ్చినపుడు చెప్తా ....

Thursday, February 2, 2012

ఇది అల్లరా ...కాదు కాదు కానే కాదు

నేను ఇప్పుడు ఒక మగానుభావును గురించి రాయబోతున్నాను .....వారు ఎవరంటే .....

మా......మా.........నేను స్కూల్ కి వెళ్ళను ,

 ఏం ఎందుకు వెళ్ళవు ? అడిగింది సదరు "మా" అనబడే వాళ్ళ అమ్మ .
ఆ టీచర్ కి ఇంగ్లిష్ రాదు మరి ఇంక నేను ఆమె దగ్గర ఏం నేర్చుకుంటాను చెప్పు ?
నీకు ఎలా తెలుసు ఆవిడకి రాదని ..
నన్ను ఒక్క కొచ్చెనేసింది దాంతో నాకు తెల్సిపోయింది ..ఏమిటా కొచ్చెను నాకు చెప్పు ...
"what is your fathers name? అని అడిగింది నాకెంత మంది ఫాదర్స్ ఉంటారని ఆవిడ ఉద్దేశ్యం? అలా అడిగింది అందుకే నేను స్కూల్ కి వెళ్ళను ..ఒరేయ్ అది fathers కాదురా "father's రా అంటే మీ నాన్న యొక్క పేరు ఏమిటి అని అర్ధం .వీడి తెలివి తేటలకి నా జోహార్లు ...అంతేకాదు కొత్త కొత్త పదాలు నేర్చుకోవడం ..అలాంటి మాటలు అనకూడదు అని వాళ్ళమ్మ కొడితే ..ఏడుస్తూ కూడా మళ్ళీ అవే మాటలు మాట్లాడుతూ ఏడవటం , దెబ్బలైనా తింటాను కానీ అల్లరి మానను అనుకునే రకం . ఒక సారి బాత్రూం లోకి వెళ్ళి తలుపు గడియపెట్టేసుకున్నాడు . బయట నుంచి వాళ్ళమ్మ స్టూలు వేసుకుని లోపలికి వంగి తీసింది లేకపోతే వాడు కాసేపట్లో ఆరునొక్క రాగం అందుకునేవాడే .ఒకరోజు ఏమైందో మరి నా మీద ప్రేమెక్కువై నా కుడిచేతి బొటనవేలు లటుక్కున కొరికేసాడు , ఏం చేస్తాం వాడి అల్లరి కి నేను కూడా ... :'( మా బాబాయ్ పెళ్ళి అయింది ఎవరైనా పిల్లలు ఆటలు ఆడుతూనో ఎవరితోనో దెబ్బలాడుతూనో ఉంటారు , వీడు మాత్రం పెళ్ళి బాజాల దగ్గర కూర్చుని ఎలా వాయిస్తున్నారో చూసేవాడు , అంతే కాక చెట్టు బెరడు ని మెడలో వేసుకుని ,రెండు పుల్లలు చేతి తో పట్టుకుని నోటితో సౌండ్ చేస్తూ వాయించేవాడు .

 వాడికి స్నానం చేయిద్దామనే నీళ్ళు తోడుతూ నేను నూతిలో పడ్డాను , నేనే వచ్చి నిన్ను కాపాడేవాణ్ణి కానీ  నేను స్నానం చేయటానికి రెడీ గా ఉన్నాను కదా ఓన్లీ నా ఒంటిమీద అండర్ వేర్  మాత్రమే ఉంది అందుకే రాలేదు అందరూ షేమ్ షేమ్‌ అంటారు అని అన్నాడు , అప్పటికి వాడి వయసు బహుసా ఆరేడేళ్ళు .

తర్వాత వాడితో పాటుగా అల్లరి పెరుగుతూ అది ఆగడాల లిస్ట్ లోకి చేరిందిట , ఎందుకంటే ఆ టైం లో నేను వాడితో పాటు లేను .

తర్వాట వాడు చాలా పెద్దవాడయ్యాడు ఎంత అంటే  పీజీ చేసేంత ..అంతేకాదు పీజీ అంటే మా బాబాయ్ పరిభాషలో "పందిరి గుంజ" అని కూడా అర్ధం (పందిరి కి వేసే వెదురు గడంత ) నిజంగానే వాడు అంత పొడుగు కూడా ఉంటాడు .వాడి తో పాటు బద్దకం కూడా బాగా పెరిగింది . కానీ వాళ్ళమ్మకి సాయం చేయడం లో మాత్రం ఉండేది కాదు . అదొక్కటే వీడి లో నాకు కనబడే మంచి .

కొన్ని రోజులు పాటు వాళ్ళింట్లో ఉండటానికి వెళ్ళాను ,నా ప్రోజెక్ట్ అక్కడే పూర్తి చేద్దామని , కానీ వాడు నాకూ , వాళ్ళ చెల్లికి కాళరాత్రులు చూపించాడు . పగలంతా  మొద్దు లా నిద్రపోయి ..మధ్యాహ్నం 1 కి లేచి అప్పుడు అన్నతిని , మళ్ళీ పడుకుని రాత్రుళ్ళు లేచి కూర్చునే వాడు అంతే వాడు అప్పుడు వాడి గోల మొదలుపెట్టేవాడు కాసేపు కంప్యూటర్ లో పాటలు ...మాకు పాట్లు ఆపరా అంటే ఇంకా సౌండు పెంచేవాడు , తిడితే వాడి దగ్గర  ఉన్న             మౌత్ ఆర్గాన్‌ తీసుకొచ్చి వాయించేవాడు అదేదో మమ్మల్ని ఆనందింప చేయడానికి అనుకుంటున్నారేమో మహ గొప్పగా వాయిస్తాడు అనుకుంటే పొరపాటు ...బాబోయ్ వాడి సంగీతం వినేకంటే డిడి8 సప్తగిరి లో వచ్చేవ్యవసాయ దారుల కార్యక్రమం పప్పు రొయ్యల పెంపకం , వరి నాట్లు వేయటం ప్రసారాలు చూస్తూ హాయిగా బాధ తెలియకుండా సునాయాసంగా ప్రాణాలు వదిలేయచ్చు . ఎలాగోలా వాడిని బ్రతిమాలి పానీపూరీ లు తినిపిస్తామని మాట ఇచ్చి వదిలించుకునేవాళ్ళం .మేము ఎంత తెలివి తక్కువ వాళ్ళ మంటే  వాడి వెపన్శ్ దాచేయాలి అని కూడా మాకు తట్టేది కాదు అంతలా వాడి వాయిద్యాలతో మా బుర్రలు మట్టి కొట్టుకు పోయేలా, తుప్పు పట్టి పోయే్లా  చేసేవాడు . ఒకరోజు మా ఖర్మ కాలి వాడి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు  , మా వీధి లో ఏక్ తార లు అమ్మేవాడు వచ్చాడు , అంతే ఇంక చూసుకోండి మా సామి రంగా అంటూ వాడి దగ్గర్ కొనేసేసి ... రాత్రుళ్ళు ఈ కొత్త వాయిద్యం తో వాయిస్తూ మా చెవులు చిల్లులు పడేలా ..సాక్షాతూ పిశాచాలే వచ్చి తమ స్వహస్తాలతో వాయిస్తున్నారా!! అన్నంత మధురంగా వాయించేవాడు .ఒకసారి కోపం వచ్చి విరగొట్టేసాము , మా గ్రహచారం గడ్డితిని మళ్ళీ ఆ ఏక్ తారా లు అమ్మేవాడు దాపురించాడు , ఈ సారి ఒకటికి రెండు కొన్నాడు , ఏదో సినిమాలో తనికెళ్ళ భరణి "పాత సామానులు కొంటాం "  అని ఎంట్రీ ఇచ్చినట్లు కొత్త ఏక్ తారా కొనాలని అనుకున్నప్పుడల్లా వచ్చేవాడు , వాడికి మా వాడు డైలీ కస్టమర్ అయ్యాడు .చిన్నప్పుడు మా బాబాయ్ పెళ్ళి లో నేర్చుకున్న సంగీతం ఇప్పుడు ఉపయోగ పడిందన్న మాట వాడికి .

ఒకసారి వాళ్ళ నాన్నమ్మ కొన్ని రోజులు ఇక్కడ గడిపి వెళ్ళింది , ఆవిడ అటు వెళ్ళిందో లేదో వాళ్ళమ్మని ఇంక      మీ అత్తగారు జంప్ కదా షురూ చేయ్ తీన్‌ మార్ అని , అసలు వీడి బుర్రలో ఏం తిరుగుతూ ఉంటుందో అర్ధమయ్యేది  కాదు .

టివీ ఆన్‌ చేసి కూర్చునేవాడు చదువులు చెడతాయని వాళ్ళ నాన్న కేబుల్ పెట్టించలేదు ఈ ఉద్ధండుడు మేడెక్కి ఏదో మతలబు చేసి కేబుల్ టివి ప్రసారాలు మచ్చలు కానీ చుక్కలు కానీ లేకుండా వచ్చేటట్లు చేసాడు , అంతే కాదు ఎపుడైనా సిగ్నల్ పోయి రాకపోతే ఆ దుర్మార్గుడు నన్ను మేడపైకి పంపి సరిచేయమనే వాడు ఎక్కడం దిగడం ..సరిగా వచ్చేంతవరకు ఇదే పని :'(.ఈ హడావుడి లో వాళ్ళ నాన్నకూడా అసలు విషయం మర్చిపోయి తనుకూడా కొడుకుతో పాటు టివి చూడటం మొదలు పెట్టాడు .

ఒకసారి మేమందరం కూర్చుని అత్త కోడళ్ళ డైలీ సీరియల్ చెత్తగా ఉన్నా మా కళ్ళన్నీ టివీ కి అప్పచెప్పి చూస్తున్నాం . సడన్‌ గా మాకు ఎలుక చచ్చిన కంపు కొటటం మొదలయింది , దెబ్బకి మేము ఆ సీరియల్ నుంచి బయటకి వచ్చి ఎక్కడబ్బా ఆ వాసన  అని తెగ వెతకడం మొదలు పెట్టాము , వెతకగా వెతకగా అది చెప్పుల స్టాండు నుంచి వస్తోందని తేలింది , బాగా పరిశీలిస్తే తెలిసింది మా బంగారయ్య వేసుకున్న సాక్స్ ల నుంచి అని ఫైనల్ నిర్ణయానికి వచ్చాము , గత నెల రోజులుగా మార్చకుండా వాడుతున్నాడట , పైగా కొత్తవే మొన్ననే నెల క్రితమే మార్చాను అన్నాడు . వాడి సాక్సులు ఉతికితే వాషింగ్ మెషీన్ ఎక్కడ పాడవుతుందో అని భయంతో వాళ్ళమ్మ అందులో కూడా వేయనివ్వకుండా విడిగా ఉతకమనేది , అవి నాన బెట్టిన బకెట్ కి పట్టిన వాసన వేడి నీళ్ళు వేసి  కడిగితే కానీ పోదేమో అని అనుమానం కూడా ఉంది . కానీ వాడు అసలు ఉతుకుంటే గా(ఎందుకంటే వాడి సాక్సులు ముట్టుకునే ధైర్యం మా ఇంటి పనమ్మాయికి కూడా లేదు ).మరి . ;-).

ఒకరోజు మేమందరం చదువుకుంటూ పడుకునే రూమ్ సర్దుదామని అనుకున్నాను , వాళ్ళమ్మ చెపుతూనే ఉంది ఎందుకొచ్చిన గొడవ వాడితో సర్దకు అని , అయినా నేను వినలేదు , నేను సర్దటం మొదలు పెట్టాను , పురావస్తు శాఖ తవ్వకాలు మొదలు పెట్టినట్లు అయింది నా పని ఏవేవో పాత వైన వస్తువులు కనిపించకుండా పోయాయి, లేదా పోయాయి అనుకున్నవి దొరికాయి , ఎలాగైతేనేం మధ్యాహ్నానికి వాడి బుక్స్ రేక్ సర్దాను , సాయంత్రానికి బలాదూర్ తిరిగి వచ్చి గది లోకి వెళ్ళి దేని కోసమో కలగాపులగంగా వెతకటం మొదలు పెట్టాడు , ఏమిట్రా అని అడిగితే  పుస్తకం ఒకటి కనిపించటం లేదు అన్నాడు తీసి ఇచ్చాను , నేనే సర్దాను గందరగోళంగా ఉందని అన్నాను పేద్ద గొప్పగా అంతే కయ్ మని అరిచి నోటికొచ్చిన అరుపులన్నీ అరిచాడు , వాడికి అలాగుంటేనే ఇష్టమట అన్నీ చక్కగా కనిపిస్తూ ఉంటాయట . ఇలాంటి వాడిని ఏం చేయాలి , ఆ గదిలో ఆంజనేయ స్వామి పోస్టరు పెద్దది ఉండేది దానిని చూసినప్పుడల్లా నాకు అది ఖాళీ గా ఉన్నట్లు అనిపించేది కళ్ళు నులుముకుని చూస్తె  నార్మల్బ గా ఉండేది బహుసా వీడి గందరగోళాన్ని చూసి ఆ దేవుడే మాయమైపోయాడేమో అని నా డౌట్ ,  అప్పటినుంచి వాడి పుస్తకాల జోలికి నేను వెళ్ళలేదు , తర్వాత ఇంకో విషయం ఏంటంటే పాత న్యూస్ పేపర్లు కూడా అమ్మనివ్వ కుండా దాచి ఉంచాడు అవి మూటలు మూటలై పేద్ద గడ్డి మేటులయ్యాయి .

నాకేదైనా హెల్ప్ చేయరం అంటే చచ్చినా చేయను అనేవాడు , నేను నా నోటికొచ్చిన తిట్లన్ని తిట్టిన తర్వాత చేసేవాడు , ముందే చేసిఉంటే ఈ గొడవ ఉండేది కాదు కదా ? ఏమొ మరి ?

ఇల్లు మారారని తెలిసి రెండు నెల్లయింది,అలాగే లేటవుతోంది ఈ సారైనా చూద్దామని వెళ్ళాను , ఇల్లంతా బాగుంది వీళ్ళ బెడ్రూం లోకి వెళ్ళి చూసాను అన్ని నీట్ గా సర్ది ఉన్నాయ్ కానీ ....చంద్రుడి లో మచ్చలా , తులసి వనం లో గంజాయి మొక్కలా ,బాపూ గారి సినిమా చూస్తుంటే మధ్యలో వచ్చే మాల్టోవా ఏడ్ లాగా  రెండు పెద్ద సైజ్  మూటలు కనిపించాయ్ ఏమిటవి అని అడిగితే మీరెవ్వరూ ముట్టుకోవటానికి వీల్లేదు అని ఏవో అమూల్యమైన వస్తువులన్ని ఉన్నట్లు బోడి గొప్పలు వీడూను అవే పాత పేపర్లు ,పుస్తకాలు , మా వారు అడగనే అడిగారు ఏమిటా మూటలు అని ఏమని చెప్తాం మరి ముసి ముసి నవ్వులు నవ్వుకుని వచ్చేసాము , అక్కడ ఓ మూలగా గిటారుని గిరాటు వేసినట్లు ఉంది అని చూసాను , ఏంటని అడిగితే ఈ సారి వాడు హింసించే పనిముట్టు ఇదే తెలిసింది  ఏక్ తారా లు అవి వాయించడం ఎప్పుడో మానేసాను అన్నాడు అంటే దాని అర్ధం ఇదా , మొత్తానికి మానలేదు , మారలేదు ..హమ్మయ్య అదృష్టం కొద్దీ నాకు పెళ్ళైపోయింది లేదంటే మా ఊరు వచ్చి కూడా వాడి టాలెంట్ చూపించేవాడు .

 ఇప్పటికి నేనంటే అభిమానమే వెర్రి నాగన్న కి ఎప్పుడూ ఫోను చేసి కాసేపు మంచీ చెడూ మాట్లాడుతూ ఉంటాడు .

 వీడికి బలవ్వడానికి త్వరలో ఇంకో జీవి రాబోతోంది పాపం ఆ అమ్మాయిని ఆ దేవుడే కాపాడాలి , ఆ అమ్మాయి కి వీడిని మార్చుకునే ఓపిక ఉండాలి  ,లేకపోతే వీడి ని ఓర్చుకునే ధైర్యం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా వినాయకుడిని కోరుకుంటున్నాను .

ఇంతకీ వాడెవరో చెప్పనే లేదు కదూ ...వాడు మా చిన్నమేనమామ కొడుకు , మా అమ్మకి ముద్దుల మేనల్లుడు అయిన మగానుభావుడు . వాడిపేరు అనంత్ శరత్ చంద్ర ...పేరుకి తగ్గట్లు వీడు రాత్రులే వెలుగుతూ (మోగుతూ )ఉంటాడు . మొన్న మా అల్లరి గురించి రాసినప్పుడు ..వాడి గురించి అసలు ఏమీ రాయలేదని ఫీల్ అయ్యాడు నీ యెంకమ్మ ఎందుకే అంత తక్కువ రాసావ్ అని అడిగాడు అందుకే మళ్ళీ ప్రత్యేకించి ఇలా రాస్తున్నా ....ఎంత రాసినా ఇంతకన్నా దారుణంగా నేను రాయలేను , కోరి కోరి నీకున్న ఇమేజ్ స్పాయిల్ చేసుకున్నావ్ రా శరత్ ...సారీ రా ఏం చేయను చెప్పు రాయడం మొదలు పెడితే నిజాలే బయటికి వస్తున్నాయి రా దున్నపోతా.అందుకే ఇంతటితో ఆపేస్తున్నా ....ఇంకోసారి సారీ :




Tuesday, December 27, 2011

అల్లరే అల్లరి


మేము చేసినంత అల్లరి ...ఎవరూ చేసి ఉండరు అని నా అనుమానం ..అంత దారుణంగా ,చెత్త చెత్తగా ,పిచ్చి పిచ్చిగా చేసేవాళ్ళం .....

బహుసా అప్పుడు నాకు మూడేళ్ళు అనుకుంటా మా నాన్నమ్మా, అమ్మా వద్దన్నా వినకుండా మా బాబాయ్ నన్ను వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిపి సైకిలు పై షికారు కి తీసుకెళ్ళాడు ...కొంతదూరం వెళ్ళిన తర్వాత దూరంగా చెరుకు తోట అంతా తీసేసిన తర్వాత మంటపెట్టారు , అది చూసి నేనేమొ ఇళ్ళు కాలిపోతున్నాయ్ బాబాయ్ అంటూ వెనుక కూర్చున్న నేను ఒక్కసారిగా లేచి నిల్చునే సరికి సైకిలు తొక్కే ఇంకో ఫ్రెండు బాలెన్స్ తప్పి కిందపడ్డాడు ..నన్ను పట్టుకుని కూర్చున్న మా బాబాయ్ నేనుకూడా ఒక్కసారిగా పడ్డాం ..కానీ నా పాదం  సైకిల్ చక్రం లో ఇరుక్కు పోయి చక్కగా మడమ దగ్గరున్న చర్మం మొత్తం ఊడి వచ్చింది ...నేను చేసిన పిచ్చి పనికి మా బాబాయ్కో కి బాగా తిట్లు , చీవాట్లు కూర్చోపెట్టి పెట్టింది మా నాన్నమ్మ ...దానికి మా అమ్మ వంత పాడింది .

ఇది జరిగిన కొన్నాళ్ళకి ...ఎన్నాళ్ళకో మరి తెలీదు ...కానీ కొన్నాళ్ళాకి ..ఏం జరిగిందంటే.....

మా బాబాయ్ లకి ఎప్పుడూ ఒకటే ఆశ ఆడపిల్లలైనా, మొగ పిల్లలైనా సరే అన్నిట్లో ఉండాలి ..ఎక్కడా భయపడకూడదు అని వాళ్ళ  అభిప్రాయం.అందుకు నాందిగా నన్ను ఎలాగైన పేద్ద ధైర్య వంతురాలిని చేయాలని ..ఏమిటేమిటో నేర్పిస్తూ ఉండేవాళ్ళు   , నేను కూడా తోక లాగ తిరుగుతూ ఉండేదాన్ని .


దీపావళీ అందరూ ఎంజోయ్ చేస్తూ అన్నీ కాల్చేస్తున్నారు , ఇంతలో మా బాబాయ్ వచ్చి నా చేతిలో సిసింద్రీ పెట్టి కాల్చ మన్నాడు , ఇంతలో మా నాన్నమ్మ ఎంటర్ అయ్యి చిన్నపిల్ల చేత ఎందుకురా ఇలాంటి పనులు వద్దురా అన్నా వినకుండా ఇద్దరం హుషారుగా కాల్చడం మొదలు పెట్టాము . (సిసింద్రీ అంటే తారాజువ్వలో ఫిల్ చేసే మందుని చిన్న కోన్షేప్ పేపర్లో ఫిల్ చేసి నేలపై వదులు తారు అది దానిష్టమొచ్చినట్లు తిరుగుతూ ఎవరి మీదకైనా రాగలిగే అవకాశం చాలా ఎక్కువ ). నాకు బాగా కాల్చడం వచ్చిందని నమ్మకంతో మా బాబాయ్ పక్కకెళ్ళి తన పని తను చూసుకోవడం మొదలు పెట్టాడు , కాసేపటికి నేను వేసిన సిసింద్ర్రీ మా బాబాయ్ మీదకే వెళ్ళి తన ప్రేమ చూపించింది ...దాని ఫలితంగా మా బాబాయ్ పొట్ట  మీద చక్కని మచ్చ పడింది ...మళ్ళీ మా నాన్నమ్మ  అర్జంటుగా మా బాబాయ్ కి హిస్టరీ క్లాసు (అంటే పాత విషయాలను మళ్ళీ తవ్విందన్నమాట )తీసుకుంది ...మా అమ్మేమో మా బాబాయ్ గురించి  ఫిలాసఫీ (పాపం చిన్నవాడు వాడికి మాత్రం ఏం తెలుసు ఇలా అవుతుందని అని )...మరి

ఏమయిందో మరి మా బాబాయ్ నా జోలికి రావడం మానేసాడు ...కానీ ఒకసారి బుద్ది వంకరగా మారిందీ అంటే అది నిలువుగ అవ్వ డానికి మరి తాతలో , ఎవరో దిగిరావాల్సిందే ,
విషయం మాత్రం మా అమ్మ చెప్పింది ...

కొన్నాళ్ళకి మా ఇంటికి మా అత్త కొడుకు వచ్చాడు ..వాడు నేను తెగ సీరియస్ గా ఆడేసుకుంటున్నాము , మా నాన్నమ్మ వచ్చి ఎందుకే సైకిల్ తో ఆడతావు నీకు సైకిల్ గండం ఉందే అని అంది ..లేదు నాకేం కాదు అని వినకుండా స్టాండ్  వేసి ఉన్న సైకిల్ చక్రం తిప్పుతూ ఆడేసుకుంటున్నాం ..ఏమైందో ఏమో వాడు ఒక్కసారిగా సైకిల్ నా మీద తోసేసి వెళ్ళిపోయాడు .
సైకిల్ ఎంతో సున్నితంగా నా మీద పడి తర్వాత దాని బ్రేకు వచ్చి  చక్కగా నా కన్నుపైన ఉన్న కనుబొమ్మని ముద్దు పెట్టుకుంది ...కొంచం ఉంటే నా కన్నుమటాష్ ఐపోయేది ... సారి మా నాన్నమ్మ ఎవరికి ప్రైవేటు చెప్పాలో తెలియక నా మనవరాలో అంటూ గోల చేసి ఆస్పటల్ కి తీసుకువెళ్ళి కుట్లు,కట్లు వేయించుకొచ్చింది.

స్కూల్ల్లో వేస్తే నా అల్లరి తగ్గుతుందేమో అని అనుమానంతో మా నాన్నమ్మ తెలిసున్నవాళ్ళ స్కూల్లో జాయిన్ చేసింది ,రోజు దింపేవాళ్ళు ఒకళ్ళైతే ,మధ్యలో నాకు మాల్టోవా తీసుకుని మా అన్నయ్య వచ్చేవాడు . ఎలాగో కాలం హాయిగా ఉంది అనుకున్నారు మా వాళ్ళు , ఒకరోజు నేను ఇంటికి వచ్చే టైం కి నా చేయి వాచి పోయి ఉంది , విషయం ఏమిటంటే నేను నా పక్కన కూర్చునే బాల కిరణ్ ని వాడిని లావుగా ఉన్నావ్ బండ కిరణ్ అని తిట్టానని వాడు నా చెయ్యి చిన్నగా మెలిపెట్టి వదిలేసాడు .ఇంక చూస్కోండి మా నాన్నమ్మ , బాబాయ్ లు అందరూ దండెత్తుకొచ్చి మా టీచరు కే ఎదురు పాఠం చెప్పేసారు .

తర్వాత నుంచి నేను చేసే ప్రతీ పనికి నా వెనుక ఒకళ్ళుండే వాళ్ళు ..ఇది మా నాన్నమ్మ ఆర్డరు మరి ...మా తాతయ్య కి పుస్తకాలు చదివే  అలవాటు పాపం నా పుణ్యమా అని ఆయనకి చదివే తీరిక లేకుండాపోయింది . ఒకరోజు నన్ను గుడిలోకి తీసుకెళ్ళారు ఆడించడానికి , మా తాతయ్య నా దగ్గరికి వచ్చి .. అమ్మలూ ...నా తల్లి  కదూ కాసేపు కుదురుగా ఆడుకుంటావా ..నేను పుస్తకం చదువు కోవాలి అని అన్నారు ...నేను బుద్దిగా తలఊపి ...నేను ఆడుకోవడం మొదలు పెట్టాను ..ఎంత సేపని కూర్చుని కుదురుగా ఆడుకోవడం ..నాకు బోరు కొట్టి అక్కడ దేవుని కోసం వేలాడేసి  ఉంచిన ఉయ్యాల గొలుసు లొ ఒక కర్ర దూర్చి ఊగడం మొదలు పెట్టాను ..అబ్బో భలే బాగుందే ...ఇంకా బాగా ఊగుదాం తాత చూత్తున్నాడా... చూత్తునాడు పుస్తకం ....హమ్మయ్య ఇంకా బాగా ఊగితే ఇంకా బాగుంటుంది జూయ్ జూయ్ జుయ్య్.....జూయ్ జూయ్ జుయ్య్.....జూయ్ జూయ్ జుయ్య్.....ఢబేల్ ....అమ్మ బాబోయ్ పడ్డాను ....హమ్మయ్యా పెద్ద దెబ్బేమి తగలలేదులే తలకే కొంచం జేజి గారి గడప కొట్టుకుంది ..మరి కోపం వచ్చిందేమో ఆయన ఉయ్యాల ఊగానని ...హబ్బా కుంచం నెప్పిగా ఉంది ...తలంతా ఏదోలా ఉంది ...పాపం తాత పుస్తకం చదూతున్నాడు గా .....ఇంట్లోకి వెళ్దాం లే ....

అమ్ములూ ఏమైందే ఒక్కదానివే వస్తున్నావ్ ....ఏంటే గౌను ఎర్ర ఎర్రగా....ఏంటే చేతులు నెత్తి మీద ..తీయ్ ......హమ్మబాబోయ్ చేతులు నిండా రక్తమేంటే ...రామచంద్రా ...భగవంతుడా ...నా మనవరాలు ....ఒరేయ్ పెద్దబ్బాయ్ ...ఏమేవ్ లక్ష్మీ , శ్రీనూ , చిట్టీ ఇలా రండ్రా ....ఏవండోయ్ ఎక్కడున్నారు ....మా నాన్నమ్మ శోకాలు పెడుతూ అర వడం మొదలు పెట్టింది ...సాధారణంగా ఆవిడ అంతలా అరవదు ..అరిచిందంటే నాకేదో అయ్యిందనే అర్ధం ... ఖంగారు లో మా అమ్మ వస్తూ  గుమ్మనికేసి తన తలని కూడా చిన్నగా తగిలించి వచ్చింది ...ఆవిడకి కూడా చిన్నగా రక్తం రావడం మొదలు పెట్టింది , మా నాన్నమ్మ తన ఏడుపులో నా పేరుతో పాటు మా అమ్మ పేరు కూడ కలిపి ...మధ్యలో మా తాత గారికి కూడా ప్రైవేటు చెప్పేసింది, మా నాన్నమ్మ చదూకోలేదు కానీ అందరికి ప్రైవేటు చెప్పేస్తూ ఉంటుంది  ... లోగా నాకు నిద్రవచ్చి నాన్నమ్మ వళ్ళోనే పడుకుని నిద్రపోవడం మొదలు పెట్టాను ...కాసేపటికి ఏదో గోల గోలగా వినిపించింది , కళ్ళు తెరిచి చూస్తే మా అమ్మ ఏడుస్తూ , మా అమ్మని తిడుతూ మా నాన్న ..ఇంట్లో ఇంతమంది ఉన్నారు చిన్నపిల్లని చూసుకోవడం మాత్రం రాదు అంటూ , లోగా నేను లేవడం చూసి హమ్మయ్య నా బంగారు ఏం కాలేదుగా నొప్పిగా ఉందా తగ్గిపోతుందిలేమ్మా అని ఇంటికి తీసుకువచ్చేసారు ... వంక పెట్టి హాయిగా నేను స్కూలుకి డుమ్మా కొట్టేసి మా నాన్నమ్మ తో ఆడుకుంటూ ...మా తాత చెప్పే కథలు వింటూ బుధ్ధిగా ఉండడం మొదలు పెట్టాను .పాపం మా నాన్నమే నా జుట్టు కి పూల జడ వేయడానికి లేకుండా పోయిందే అని అప్పుడప్పుడూ మా తాత ని తిడుతూ శోకాలు పెట్టేది .

ఇవే కాదు ఇంకా చాలా అల్లరి ..మా కుక్క పిల్లతో ఆడుతూ దానికి కోపం తెప్పిస్తే అది నన్ను కరిచినంత పని చేయడం , మా అక్క తో సైకిలు నేర్చుకుంటూ ముళ్ళ కంపలో పడటం ...మా నాన్నమ్మ ఆ టైం లో ఊర్లో లేదు ...ఆ తర్వాత నన్నే కాదు మా అందరినీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది ..మళ్ళీ తిరిగి రాలేదు ..బహుసా మాట వినటం లేదని కోపం వచ్చి వెళ్ళిపోయింది అనుకున్నా..అమ్మేమో దేవుడి దగ్గరకి వెళ్ళిపోయింది అని చెప్పింది .

మళ్ళీ తర్వాత చాలా రోజులు నేను బుద్ది గానే ఉన్నాను , కానీ  ఒకసారి మా ఇంటికి మా మావయ్య లు వాళ్ళ పిల్లలు వచ్చారు ... వాళ్ళు కూడా నా లాగే చాలా మంచి వాళ్ళన్నమాట ..అందరం కలిసి వీధిలో ఉన్న బావిలో నీళ్ళు తోడుతూ చేద అందులో పాడేసి కామ్గా ఇంట్లోకి వచ్చి కూర్చున్నాం . ఆ తర్వాత విషయం తెలిసిన మా తాత చక్కగా అందరికి ఇంగ్లీషు పాఠం చెప్పేసారు .( ఆయన ఇంగ్లీషు మాస్టారు మరి ).మళ్ళీ బావి దగ్గరికి వెళ్తే అందరినీ సపోటా చెట్టుకి కట్టేస్తానన్నారు .హమ్మో దానికి కట్టేస్తే చిలకలు పడేసిన సపోటాలు ఎవరు తింటారు .వీధిలో బావి దగ్గరికి వెళ్తేనే తిడతారు ,ఇంట్లో బావి తోనే సరిపెట్టుకుందాం అని నీళ్ళు తోడటం మొదలు పెట్టాము , బుడుంగ్ ,తియ్ తియ్ తియ్ ,బడ బడ బడ, ....ఇంతలో బుడుంగ్ ....బుళక్ బుళక్ ...అయ్యొ మళ్ళీ చేద పడిపోయింది ..మళ్ళీ తాత తిడతారు అందుకుందాం కొంచం వంగి ...అయ్యొ కాలు జారి నూతిలో పడిపో...............హమ్మయ్యా ఎవరో నా కాలు చేయి పట్టుకున్నారు ..కనిపించటం లేదు చీకటిగ ఉంది కానీ గట్టిగా పట్టుకున్నారు ఎవరో ...నెమ్మదిగా లేద్దాం , అయ్యో అమ్ములూ .....అయ్యయ్యో ...ఎవరైనా ఉన్నారా....బావిలో పడేలా ఉంది పిల్ల ...రండర్రా ...హమ్మయ్య నన్ను మా పిన్ని , అమ్మ , అత్తలు అందరూ కలిసి పైకి లాగారు , ఓ పక్క నన్ను చూస్తూ ..మా మావయ్య కూతురుని కూడా తెగ ముద్దులు పెడుతున్నారు ..పాపం అదే నన్ను పడకుండా పట్టుకుంది , నాలాగే  చిన్నదే తను  కూడా.
  తర్వాత మేము చాలా రోజులు అల్లరి చేయలేదు ...ఎవరూ మళ్ళీ బావి దగ్గరకి కూడా వెళ్ళలేదు చాలా బేడ్ బావులు  రెండు సార్లు మా గురించి కంప్లయింట్ చేసాయ్ ,అవి రెండూ ఫ్రెండ్సేమో అని కోపం వచ్చింది మాకు .సైకిళ్ళు తొక్కుకుంటూ అవి పాడుచేస్తూ ,పడక కుర్చీకి కర్రలు తీసేసి మా చుట్టాలని కూర్చోమనడం ,  ఆవకాయ ముక్కలు అత్తలు చూడకుండా దాచేసుకుని రాత్రి పడుకునేప్పుడు తినేస్తూ , అప్పుడప్పుడు మేడ పైకి ఎక్కి పైనించి దారిం పోయే వాళ్ళమీద నీళ్ళు చిందించడం ,మధ్యలో  పుస్తకాలూ చదువుతూ ,అయిపోగానే చింపుతు అప్పుడప్పుడు గన్నేరు చెట్లు ఎక్కి గుడి పై వాలి ఉన్న కొమ్మల సాయంతో గుడి మీదకి కూడా ఎక్కే వాళ్ళం కూడా మా అమ్మ అంటూ ఉంటుంది "సెలవొస్తే కుక్కల్ని గుడి ఎక్కించొచ్చు " అని కానీ ఎన్ని సార్లు ప్రయత్నించినా మా పిరికి కుక్కపిల్ల పైకి ఎక్కేదే కాదు , బ్లేళ్ళ తో ఆడుతూ చిన్న చిన్న గా చేతులు కోసుకునే వాళ్ళం,అప్పుడప్పుడు మా చేతులు ,భుజాలు ఒకళ్ళకొకళ్ళు కొరుక్కోవడాలు, మా చిన్న మావయ్య కొడుకు బాత్రూం లో ఇరుక్కుపోతే మా అత్త స్టూలు వేసుకుని తీయడాలు . అందరూ తినాల్సిన టిఫిన్‌ ని మా బాబాయ్ వేసిన పందెం లో నెగ్గాలని నేను, నా చెల్లి కలిసి తినేయడం ,ఎప్పుడైనా కామ్గా ఉన్నామంటే  ఏదో మంచి పని చేసామని మావాళ్ళు అనుకుని వచ్చి చూసేవాళ్ళు కానీ అక్కడ ఏమీ కనిపించేది కాదు ...ఎందుకంటే మేము వాటిని చక్కగా క్లీన్చేసేసేవాళ్ళం మరి ,అల్లరి చేస్తే దొరకకుండా చేయాలి అని కొత్తగా నేర్చుకున్నాం, తర్వాత తెలిసేది అద్దాలు పగిలాయని .ఈ విషయం లో మా చెల్లెళ్ళు మాకు సాయం చేసేవాళ్ళు ,  మధ్య లో మా అమ్మమ్మ అప్పుడప్పుడూ మా వాళ్ళకి కంప్లయింట్ చేసేది కానీ అందరిని కలిపి తిట్టాలంటే అందరూ ఒక్కసారి దొరకాలిగా. ఒకళ్ళ ఇద్దరా అరడజను పైగా ఉండేవాళ్ళం , అర్ధరాత్రైనా అపరాత్రైనా వీధుల పడి తిరగడమే ...మరి పక్క వీధిలో చుట్టాలున్నారు వాళ్ళని కూడా కవర్ చేయాలి కదా"లూనా"  దొరికితే ఊరంతా తిరగడాలు ,మూడు ముంతకింద పప్పులు ...ఆరు మిరపాకాయ బజ్జీలు గా కాలం గడిపేసాము.ముందే చెప్పానుగా మా కన్న తెలివైన పోరి ఒకతి ఉంది అనివరుసల విషయం లో చెప్పానుగా  .అదేనండి మా చిన్న మావయ్య కూతురు .ఎప్పుడూ మా అమ్మ మ్మ కి అదంటేనే ఇష్టమని మాకు "doubt వచ్చేది , ఎందుకంటే అది చాలా మంచి పిల్ల అని మా అమ్మమ్మ అభిప్రాయం ..అందరూ ఒకలాగ ఉండి అదొక్కతే ఒకలా ఉంది  ఎలాగబ్బా మరి అనుకునేవాళ్ళం .ఇలాంటి "confusion ఉండకూడదని ,అదే కొన్నాళ్ళ కి అందరి అనుమానాలు తీర్చేసింది, ఒకరోజు తీరికగా కూర్చుని  పూసల దండ తెంపి చక్కగా ఒకొక్కటీ నోట్లో వేసుకుని మింగేసింది ...ఎలా  అని అడిగితే, ఇదిగో ఇలా అని మిగిలిన పూసలని కూడా మింగి చూపించింది .ఒకరోజు మా అమ్మమ్మ దానితో వాదిస్తూ " ఇలా ఐతే నేను మీ ఇంటికి రాను ఫో " అంది ....అంతే వెంటనే మా హీరోయిన్‌ " హమ్మయ్య రాక పోతే ఇంకా హాయి,హాయిగా ఉంటాము ఎంచక్కా "అంది , పాపం అప్పటి నుంచి మా అమ్మమ్మ తన అభిప్రాయాన్ని మార్చేసుకుంది ,ఏం చేస్తాం .. మేమేమి నేర్పించలేదు .
తర్వాత ఎవరి చదువులు వాళ్ళవి , ఎవరి గోలలో వాళ్ళం  ఉండిపోయి మా అల్లరి తగ్గించాము,కానీ కలిసినప్పుడు అల్లరి మానలేదు ..మా ఇంట్లో అప్పుడప్పుడు అర్ధరాత్రుళ్ళు పిశాచాలు ఏక్ తారాలు వాయిస్తాయి తెలుసా, ఇంకా తిక్కరేగితే గిటార్ కూడా టర్ టర్ అంటూ ఉంటుంది .అది మా మీద కోపం వస్తే మా మావయ్య  కొడుకు చేసే వింత రాగాలు అవి .ఇప్పటికీ భోజనాలకి అందరం కలిసి కూర్చుంటే మా కంచాల్లో ఆవకాయ ముక్కలు ,నచ్చిన కూరలు తారు మారు అవుతూ ఉంటాయ్ ,ఒక్కోసారి మాయం కూడా అవుతు ఉంటాయ్ .మాకు తోడుగా మా బాబాయ్ లు ,మావయ్యలు కూడా తమ వంతు సాయం చేస్తూ ఉంటారు .

మా అల్లరి ని ఇంతదాకా భరించిన వాళ్ళకి , ప్రస్తుతం భరిస్తూ మమ్మల్ని...ఇంకా భరించాల్సిన వాళ్ళకి మా అందరి తరఫున ధన్యవాదాలు ...మీరు కూడా ఇంచుమించు ఇలాగే పెరిగి ఉంటారు ..మనకైతే మనని చూసుకోవడానికి పెద్దవాళ్ళు ఉండేవారు ...


                                  మరి మీ పిల్లల సంగతో !!!!


తస్మాత్ జాగ్రత, ఎందుకంటే మన బాల్యాన్ని మనకి తిరిగి చూపేందుకు మనకోసమని పైనున్నమన నాన్నమ్మలు ,తాతయ్యలు దేవుని ద్వారా  పంపించిన అందమైన అద్దాలు (ప్రతిబింబాలు) .